హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమా విడుదల కాగానే.. ఆ సినిమాపై విమర్శల దాడి మొదలయ్యింది. ఈ చిత్రంపై ఆధ్యాత్మిక ప్రాంతాలుగా పేరుగాంచిన వారణాసి మొదలుకొని హరిద్వార్ వరకూ కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ‘ఆది పురుష్’పై జనాగ్రహం వ్యక్తమవుతోంది. నగరంలోని శ్రీరామ సేన కార్యకర్తలు ‘ఆది పురుష్’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటకు పంపిస్తూ, ఆయా థియేటర్లను మూసివేయిస్తున్నారు.
రూ. 500 కోట్ల బారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘ఆది పురుష్’పై మొదలైన ఆందోళనలు ఇప్పట్లో ఆగేలా లేవు. దేశవ్యాపంగా ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.ఇదే కోవలో రామజన్మభూమి అయిన అయోధ్యలో ‘ఆది పురుష్’పై ఆందోళనలు మిన్నంటాయి. ఈ ప్రాంతానికి చెందిన హిందూ సంస్థలు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను మూసివేయిస్తున్నాయి.
శ్రీరామ సేన కార్యకర్తలు ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తూ, ప్రదర్శనలను మధ్యలోనే నిలిపివేయిస్తున్నారు. థియేటర్లలోకి చొరబడిన శ్రీరామ సేన కార్యకర్తలు కాషాయ జండాలు ప్రదర్శిస్తూ, ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోలీసుల సమక్షంలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేయిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షుడు దినే సింగ్ మాట్లాడుతూ ‘అసంబద్ధమైన సినిమా రూపొందించారు. మన సంస్కృతిని కించపరిచారు. దీనిని అయోధ్యలో ప్రదర్శించబోనీయం. ‘ఆది పురుష్’ సినిమాను అయోధ్యలో ఎట్టిపరిస్థితిలోనూ ఆడబోనీయం’ అని స్పష్టం చేశారు.
వారణాసి మొదలు హరిద్వార్ వరకూ..
‘ఆది పురుష్’ సినిమాపై వారణాసి మొదలు అయోధ్య వరకూ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. అఖిల భారతీయ సంత్ సమితి ప్రతినిధి జితేంద్రానంద మాట్లాడుతూ ఈ సినిమాలోని డైలాగులు స్వామీజీలకే అర్థం కావడంలేదని, సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలను వక్రీకరించారన్నారు.
హరిద్వార్‌లోనూ ‘ఆది పురుష్’ సినిమాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి హిందూ సంఘాలు ఈ సినిమాను చూడొద్దంటూ ప్రేక్షకులను కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సినిమాపై తాత్కాలికంగానైనా నిషేధం విధించాలని కోరుతున్నాయి.
ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్’పై అఖిల భారత హిందూ సభ విమర్శల బాణం!
Comments
Please login to add a commentAdd a comment