రాజస్తాన్ ఎన్నికల ప్రచారాలు తుది అంకానికి వచ్చేశాయి. నేటితో పార్టీల ప్రచార ర్యాలీలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తారాస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అల్లర్లకు ఆధ్యం పోశారే గానీ నియత్రించేలా కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. గహ్లోత్ ప్రభుత్వం హయాంలో బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటాయి. గత ఐదేళ్లలో ఛబ్రా, కరౌలీ, భిల్వారా, జోధ్‌పూర్, చిత్తోర్‌గఢ్, నోహర్, వేవాత్, మల్పురా, జైపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లే అందుకు ఉదాహారణ అని ఆరోపించారు.
బుల్డోజర్‌లతో సలాసర్‌లోని రామ్ దర్బార్‌ని, ఆవుల షెడ్డుని ఎలా కూలదోసిందో చెప్పుకొచ్చారు. అలాగే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసంగా చెప్పారు. రాజస్తాన్‌లో తమ పార్టీ ప్రతి మూలన సమూలమైన మార్పు తీసుకువస్తుందని, ముఖ్యంగా నేరాల తీవ్రత తగ్గిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా చివరి రోజు ర్యాలీలో బీజేపీపై విమర్శల దూకుడును పెంచేశారు. అదాని వంటి ఇష్యులను అస్త్రాలుగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.
పైగా ఇరు పార్టీలో పోటాపోటీగా తమ అగ్ర నాయకులను ప్రచార ర్యాలీల బరిలోకి దింపారు. ఇటు బీజేపీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటిని ప్రచారంలోకి దించితే..అటు కాంగ్రెస్ కూడా పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని దింపింది. కాగా, ఈ నెల 25న 200 అసెంబ్లీ స్థానాలున్నా రాజస్తాన్‌లో ఈసారి 199 స్థానాల్లోనూ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
(చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని.)
Comments
Please login to add a commentAdd a comment