రాజ్యసభలో..
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అనుచిత వ్యాపారం విధానంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు కేంద్రం తెలిపింది. ఈ–కామర్స్ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్లెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వినియోగదారుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనల సవరణకు ముందుగా వ్యాపారవర్గాల సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద గత ఏడాది మే, జూన్ నెలల్లో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుక్కున్న వలస కార్మికులు, రేషన్‌కార్డులు లేనివారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి జవాబిచ్చారు.
2015–16 నుంచి కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తోందని, పంట దిగుబడి నుంచి సర్టిఫికేషన్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకరిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 6 వేల సముద్రపు పాచితెప్పలు, 1,200 ట్యూబ్‌నెట్‌లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు రూ.1.86 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ డివిజన్ పనులకు రూ.170 కోట్లు అవుతుందని అంచనా వేయగా, 2021–22 బడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించినట్లు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు.
లోక్‌సభలో..
సెప్టెంబర్ కల్లా మంగళగిరి ఎయిమ్స్ పూర్తి
మంగళగిరి ఎయిమ్స్ సెప్టెంబర్‌కల్లా పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. ఈ ఎయిమ్స్‌కు రూ.1,618 కోట్లు మంజూరుకాగా రూ.922.01 కోట్లు విడుదల చేశామని, రూ.880.15 కోట్లు ఖర్చయిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్ చెప్పారు. దేశంలో 26 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లుగా మలేరియా మరణాల్లేవని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్సుఖ్ మాండవీయా చెప్పారు. ఆయుష్–64 సాంకేతికతను దేశవ్యాప్తంగా 37 సంస్థలకు బదిలీ చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.459.78 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీలు వంగా గీత, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment