
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్ ఈ బెయిల్ వర్తించనుంది. అప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు లిక్కర్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, మద్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించింది.
కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది.
- ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్
- మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.
- జూన్ ఒకటో తేదీ వరకు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.
- జూన్ రెండవ తేదీన కేజ్రీవాల్ లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
- లిక్కర్ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని కోర్టును కోరిన ఈడి తరపు న్యాయవాది.
- మీరు కూడా అంతకంటే గట్టిగ కౌంటర్ ఇవ్వాలని సూచించిన ధర్మాసనం.
- కేజ్రీవాల్ 21 రోజులు జైల్లో ఉన్నా.. బయట ఉన్నా.. పెద్ద తేడా లేదన్న ధర్మాసనం.
- కేజ్రీవాల్ కు జూన్ 4 వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన కేజ్రీవాల్ తరపు న్యాయవాది.
- కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం
అంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. తాజాగా కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ షరతులు:
- ఢిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర గురించి బయట మాట్లాడకూడదు
- ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షులతో మాట్లాడకూడదు
- ఢిల్లీ లిక్కర్ కేసు అధికారిక ఫైల్స్ చూడకూడదు
- ఎలాంటి అధికారిక పత్రాలపై సంతకాలు చేయకూడదు
- సీఎం ఆఫీస్ కు, సెక్రటేరియట్ కు వెళ్లకూడదు
- 50వేల షూరిటీ బాండ్, ఒకరి పూచికత్తు సమర్పించాలి