సుమతీ మొరార్జీ మహాత్మాగాంధీకి సన్నిహితురాలు. భారత స్వాతంత్య్రోద్యమంలో 1942–1946 మధ్య ఆయన వెంట ఉండి, ఆయన వెంట నడిచిన ముఖ్యులలో సుమతి ఒకరు. అప్పటి వార్తా పత్రికల్లో వచ్చే ఫొటోలలో గాంధీజీ పక్కన సుమతి తప్పనిసరిగా కనిపించేవారు. గాంధీజీ ఉద్యమ కార్యక్రమాల కాలపట్టిక ఆమె చేతుల్లో ఉండేది. వాటి నిర్వహణ కూడా. గాంధీ అనంతరం కూడా సుమతీ మొరార్జీ గాంధీ మార్గంలోనే పయనించారు. దేశ విభజన సమయంలో సింధీలను పాకిస్థాన్ నుంచి భారత్‌కు తెప్పించడంలో కీలకమైన పాత్రను పోషించారు.
ఇప్పటివరకు ఇదంతా గాంధీ శకంలో సుమతి ఏమిటన్నది. ఆ తర్వాత కూడా స్వతంత్ర భారతాన్ని మలచడంలో ఆమె ప్రమేయం ఎంతో ఉంది. ‘ఇండియన్ షిప్పింగ్ ఫస్ట్ ఉమన్’ గా సుమతీ మొరార్జీ ప్రసిద్ధి. భారతదేశ నౌకల యజమానుల సంఘానికి (ఇండియన్ నేషనల్ స్టీమ్‌షిప్ ఓనర్స్ అసోసియేషన్. తర్వాత ఇది ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ అయింది) సారథిగా ఉన్న సుమతి ప్రపంచంలోనే అలాంటి ప్రతిష్టను పొందిన తొలి మహిళ. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత, ఆమె అందించిన పౌరసేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1971లో ఆమెకు పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.
సుమతీ మొరార్జీ బొంబాయిలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. అప్పటి సంప్రదాయం ప్రకారం సుమతికి చిన్న వయసులోనే వివాహం అయింది. ఆమె భర్త మరొక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన శాంతికుమార్ నరోత్తమ్ మొరార్జీ. ఆమె మామగారు నరోత్తమ్ మొరార్జీ ప్రముఖ వ్యాపారవేత్త, ‘సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ’ వ్యవస్థాపకులు. భారతదేశపు అతిపెద్ద రవాణా నౌకల తయారీ, నిర్వహణల సంస్థ అది. సుమతి 14 ఏళ్ల వయసుకే ఆ కంపెనీ మేనేజింగ్ ఏజెన్సీలో భాగం అయ్యారు! 1923లో అలా ‘నౌక’లోకి అడుగుపెట్టిన అమ్మాయి 1946లో ఆ కంపెనీ స్టీరింగ్ సీట్లో కూర్చున్నారు.
ఆనాటికి కంపెనీలో ఉన్న 6 వేల మంది సిబ్బందితో కలిసి, వారిలో ఒక ఉద్యోగిగా సంస్థను లాభాలతో నడిపారు. అంతకు ముందు వరకు ఆమె ఎక్కువ సమయాన్ని జాతీయోద్యమానికే కేటాయించారు. షిప్పింగ్ సంస్థ సారథిగా ఆమె అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ముంబైలోని జుహులో ఉన్న సుమతి విద్యా కేంద్ర పాఠశాల సుమతి స్థాపించినదే. ఆచార్య స్వామి ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) కు అన్నివిధాలా చేదోడుగా ఉన్నారు. తన 89 ఏళ్ల వయసులో 1998లో సుమతి కన్నుమూశారు.
(చదవండి: గుజరాత్ అల్లర్లు)
Comments
Please login to add a commentAdd a comment