భోపాల్: వాహనంలో ఇంధనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, భోపాల్ మాత్రం కొందరు ఆకతాయిలు కావాలనే ఓ పెంట్రోల్ బంక్‌కు నిప్పంటినట్టు తెలుస్తోంది. బైక్‌లో పెట్రోల్ కొట‍్టించుకునే క్రమంలో ముగ్గురు యువకులు బంక్‌కు వెళ్లారు.సిబ్బంది పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా లైటర్ వెలిగించాడు.
దాంతో ఒక్కసారిగా మంటలు పెట్రోల్ నాజిల్ ద్వారా బైక్‌కు వ్యాపించాయి. అటునుంచి పెట్రోల్ పంపుకు ఎగబాకాయి. భయంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన పెట్రోల్ పంపు సిబ‍్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కటరా హిల్స్‌లోని రేణుగా పెట్రోల్ బంక్‌లో జరిగింది. రూ.8000 నష్టం జరిగినట్లు బంక్ యాజమాన్యం పేర్కొంది.
(చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి సరైన సమయం ఏదంటే..)
సంఘటన స్థలం నుంచి ఇద్దరు నిందితులు పారిపోగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. టైల్స్ వర్క్ చేసే ఇతనిపై ఇప్పటికే క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విజయ్ సింగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్‍లుగా గుర్తించారు. వీరు మెకానిక్ వర్క్ చేసేవారని స‍్థానికులు వెల్లడించారు.
అయితే, నిందితులు కావాలనే లైటర్ వెలిగించారా? లేక మరే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌లో సిబ్బంది పెట్రోల్ నింపే క్రమంలో రీడింగ్ చూడడం కోసం ఓ యువకుడు లైటర్ వెలిగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డ తర్వాతే ఈ ఘటనకు అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
(మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!)
Comments
Please login to add a commentAdd a comment