పట్నా: హై వోల్టేజీ రాజకీయ డ్రామాకు బిహార్ వేదికగా మారింది. ఊహించినట్టుగానే జనతాదళ్(యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (71) బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో ఐదేళ్ల సంకీర్ణ బంధానికి గుడ్‌బై చెప్పారు. మహారాష్ట్ర మార్కు వ్యూహంతో తన సీఎం పీఠానికి బీజేపీ ఎసరు పెడుతోందన్న అనుమానంతో తానే ముందుగా చకచకా పావులు కదిపారు. సీఎం పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో రెండేళ్ల బీజేపీ–జేడీ(యూ) సంకీర్ణ పాలనకు తెర దించడమే గాక వెనువెంటనే ఆర్జేడీ నేతృత్వంలోని మహా ఘట్‌బంధన్‌లో చేరి మళ్లీ సీఎం పీఠమెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు!
బుధవారం మధ్యాహ్నం రెండింటికి రాజ్‌భవన్‌లో సాదాసీదాగా జరిగే కార్యక్రమంలో సీఎంగా నితీశ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. కొత్త మంత్రివర్గంలో జేడీ(యూ), ఆర్జేడీతో పాటు కాంగ్రెస్‌కు కూడా స్థానం దక్కుతుందని చెబుతున్నారు. వామపక్షాలు బయటినుంచి మద్దతిస్తాయని తెలుస్తోంది. బిహార్ సీఎం పదవి చేపట్టనుండటం నితీశ్‌కు ఇది ఏకంగా ఎనిమిదోసారి కావడం విశేషం!
కాగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం గత తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి. ఈ పరిణామాలపై బీజేపీ మండిపడగా కాంగ్రెస్ తదితర విపక్షాలు హర్షం వెలిబుచ్చాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ప్రజలిచ్చిన తీర్పును నితీశ్ అపహాస్యం చేశారంటూ బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ దుయ్యబట్టారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. తాను పల్టూ రామ్ (పార్టీలు మార్చే వ్యక్తి)నని నితీశ్ మరోసారి రుజువు చేసుకున్నారని కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే విమర్శించారు. ఆయన అహంకారంతో మిడిసిపడుతున్నారన్నారు. జేడీ(యూ)కు బిహార్‌లో బీజేపీ కంటే తక్కువ సీట్లున్నా సంకీర్ణ ధర్మాన్ని గౌరవిస్తూ నితీశ్‌ను సీఎంను చేశామని గుర్తు చేశారు. లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకే బిహార్‌లో నితీశ్‌కు మద్దతిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి 122 స్థానాలు అవసరం. జేడీ(యూ)కు 45, ఆర్జేడీకి 79 మంది, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 77 మంది ఉన్నారు.
బిహార్‌లో మంగళవారం రోజంతా ఏం జరిగిందంటే...
ఉదయం 11 : నితీశ్ నివాసంలో జేడీ(యూ) ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ.
మధ్యాహ్నం 1 : మహా ఘట్‌బంధన్ నేతల భేటీ. నితీశ్‌కు మద్దతు లేఖపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ తదితర పార్టీల ఎమ్మెల్యేల సంతకం.
మధ్యాహ్నం 2 : మళ్లీ జేడీ(యూ) భేటీ. కొత్త సంకీర్ణానికి ఎమ్మెల్యేల మద్దతు.
సాయంత్రం 4 : ‘ఎన్డీఏ’ సీఎం పదవికి రాజీనామా లేఖ గవర్నర్‌కు అందజేత
4.45 : రబ్రీ నివాసంలో తేజస్వి, ఇతర నేతలతో నితీశ్ మంతనాలు.
5.20 : నేతలందరితో కలిసి రాజ్‌భవన్ బయల్దేరిన నితీశ్.
6:00 : 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ గవర్నర్‌కు సమర్పణ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి.
రోజంతా రాజకీయ వేడి
బిహార్‌లో జేడీ(యూ), బీజేపీ సంబంధాలు చాలాకాలంగా క్షీణిస్తూ వస్తున్నాయి. బీజేపీ ఆధిపత్య ధోరణిపై నితీశ్ చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. దాంతో ఎన్డీఏతో ఆయన మరోసారి తెగదెంపులు చేసుకోవడం ఖాయమంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం జేడీ(యూ) సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తదితరులతో నితీశ్ భేటీ అయ్యారు. సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. తమకు వెన్నుపోటు పొడవాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు. జేడీ(యూ) సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ ద్వారా పార్టీలో తిరుగుబాటుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
భేటీ నుంచి నితీశ్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు. ‘‘ఎన్డీఏ సంకీర్ణాన్ని వీడాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ‘ఎన్డీఏ’సీఎం పదవికి రాజీనామా చేశా’నని మీడియాకు చెప్పి వెనుదిరిగారు. అనంతరం శరవేగంగా పావులు కదిపారు. తేజస్వీ తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ తేజస్వీ యాదవ్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, హిందూస్తానీ అవామ్ మోర్చా నాయకుడు జితన్‌రాం మాంఝీ తదితర మహా ఘట్‌బంధన్ నేతలతో అరగంట పాటు మంతనాలు జరిపారు. వారందరితో కలిసి గంటసేపటికే మరోసారి గవర్నర్‌ను కలిశారు.
ఏడు పార్టీలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన మహా ఘట్‌బంధన్ తమ నేతగా తనను ఎన్నుకుందని వివరించారు. కనుక ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త సంకీర్ణానికి అవకాశమివ్వాల్సిందిగా కోరారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అందజేసినట్టు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నితీశ్ చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్‌గాంధీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. తనకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోకెల్లా అత్యంత అనుభవజ్ఞుడైన సీఎంగా నితీశ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తేజస్వీ కొనియాడారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలే నితీశ్ తాజా నిర్ణయానికి ప్రధాన కారణమని సీపీఎంఎల్‌ఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అంతకుముందు తేజస్వి తదితరులతో రబ్రీ నివాసంలో నితీశ్ మంతనాలు జరుపుతుండగానే ‘మహా ఘట్‌బంధన్ సీఎంగా నితీశ్‌కు శుభాకాంక్షలు’అంటూ జేడీ(యూ) సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు!
చదవండి: మాది సంకీర్ణ ధర్మం- నితీశ్‌దేమో..: బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment