
బీహార్ పోలీసులు ఇకపై ఉచిత జీవిత బీమా ప్రయోజనం పొందనున్నారు. తాజాగా బీహార్ పోలీసు విభాగం బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పుందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు పోలీసు సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే, వారి కుటుంబానికి రూ.2.30 కోట్ల వరకు బీమా ప్రయోజనం అందుతుందని బీహార్ పోలీసులు తెలిపారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాతో బీహార్ పోలీసులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దరిమిలా పోలీసు విభాగానికి చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ (హెడ్‌క్వార్టర్స్) జెఎస్ గంగ్వార్ మాట్లాడుతూ తమ సిబ్బంది కోసం ఉచిత జీవిత బీమా ప్రయోజనం కల్పించామన్నారు. దీనిలో సహజ మరణమైతే రూ.20 లక్షల వరకు అందజేస్తారన్నారు. డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బందికి బీమా ప్రయోజనం రూ.2.30 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 1.50 కోట్ల అదనపు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు.
ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి వికలాంగునిగా మారితే రూ.1.50 కోట్ల వరకు బీమా ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్ పోలీస్ విభాగంలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి కూడా ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్లు గాంగ్వార్ తెలిపారు. బీమా నిబంధనలలో సిబ్బంది కుమార్తెల వివాహం, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం కూడా ఉంటుందన్నారు.