అగర్తలా: త్రిపుర స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్థానిక సంస్థల్లోని మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లోని మొత్తం 51 స్థానాలతోపాటు రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ఏఎంసీలో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీలు అనూహ్యంగా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్‌ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్ నగర్, అమర్‌పూర్‌నగర్ తదితర పంచాయత్‌లలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. మతకలహాలు, ఘర్షణలు, కోర్టు కేసులు.. ఎన్నికలను ప్రశాంతంగా జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎంలు డిమాండ్ చేశాయి.
సుపరిపాలనకే త్రిపుర ప్రజలు మొగ్గు: ప్రధాని
త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో కూడిన రాజకీయాలకే త్రిపుర ప్రజలు మొగ్గు చూపారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment