ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే రొట్టె తినేవారు. ఇప్పుడైతే భారతీయుల్లో చాలామంది ప్రతిరోజూ రొట్టెల్ని లాగించేస్తున్నారు. అదేమంటే.. ఆరోగ్యం కోసమేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రొట్టెలు క్రేజీ ఫుడ్‌గా మారుతుండగా.. వాటి వినియోగంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం దేశంలో బ్రెడ్స్ అమ్మకాల విలువ 640 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024 మిలియన్ డాలర్లకు చేరిందంటే రొట్టెలు భారతీయులతో ఎలా లొట్టలు వేయిస్తున్నాయో అవగతం చేసుకోవచ్చు.
సాక్షి, అమరావతి: పాశ్చాత్య వంటకమైన బ్రెడ్ భారతీయుల భోజనంలో ప్రధాన ఆహారంగా మారిపోతోంది. వేగవంతమైన జీవనశైలి, పనిభారం వల్ల వివిధ రకాల బ్రెడ్స్ భారతీయ భోజనశాలను ఆక్రమిస్తున్నాయి. ఎంతగా అంటే మసాలాలతో కూడిన కూరగాయ వంటకాలను భర్తీ చేస్తూ డైనింగ్ టేబుల్‌పై తిష్టవేస్తున్నాయి. జామ్, బటర్, పీనట్ బటర్ వంటి స్ప్రెడ్‌ల ఎంపికతో టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్లు పట్టణ వాసుల ఇళ్లలో నిత్య అల్పాహారాలుగా మారుతున్నాయి. రెడీ టు కుక్ ఆహారం అందుబాటులోకి రావడంతో మహిళలు సూప్, సలాడ్ డిన్నర్‌లను బ్రెడ్‌తో చేయడానికే మక్కువ చూపుతుండటం విశేషం.
దక్షిణాది రాష్ట్రాలే టాప్
జాతీయ పోషకాహార సర్వే ప్రకారం బ్రెడ్ వినియోగిస్తున్న కుటుంబాల్లో ఓ వ్యక్తి సగటున రోజుకు 80 గ్రాముల బ్రెడ్ ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో స్త్రీల (66 గ్రా) కంటే పురుషులే (96 గ్రా) ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి ఒక కుటుంబం ఏడాదికి 31.7 కిలోలుగా పెరగనుంది. భారత్‌లో అతిపెద్ద బ్రెడ్ వినియోగదారుల జాబితాలో దక్షిణ భారతదేశం మొదటి స్థానంలో ఉండటం విశేషం. భారతదేశ బ్రెడ్ మార్కెట్ 2017లో 640.73 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024.54 (సుమారు రూ.837 కోట్లు) మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులు నెలకు బ్రెడ్ కోసం రూ.300 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు.
ప్రొటీన్ బ్రెడ్స్ కూడా వచ్చేశాయ్
దేశంలో ఊబకాయ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది 2030 నాటికి దాదాపు 27 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇందుకు భారతీయుల ఆహారంలో కార్బోహైడ్రేట్లే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సంప్రదాయ భారతీయ భోజనంలో అన్నం, రోటీ, వేపుడు పదార్థాలు ఉంటాయి. దీనికితోడు ఆధునిక జీవనశైలిలో తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పెరిగిపోయి ఊబకాయానికి దారి తీస్తోంది. శరీరానికి కార్బోహైడ్రేట్లు అవసరమే కానీ.. కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రెడ్‌లలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్ వంటివి లభిస్తున్నాయి. జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్‌ని అధికంగా అందిస్తున్నాయి.
మల్టీగ్రెయిన్ బ్రెడ్స్‌దే హవా
మార్కెట్‌లో రకరకాల బ్రెడ్స్ వస్తున్నాయి. తృణధాన్యాల వినియోగం కాలక్రమేణా పెరుగుతోంది. హోల్‌గ్రెయిన్, మల్టీ గ్రెయిన్, రై బ్రెడ్, వీట్ బ్రెడ్‌లు అన్ని సూపర్ మార్కెట్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పట్టణ ప్రజలు రొట్టెల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల కంటే తృణధాన్యాల ఉత్పత్తుల్లో ఎక్కువ డైటరీ ఫైబర్ కంటెంట్ ఉన్నందున అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి.
చదవండి: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment