భార్యతో రమేష్ సుబ్రమణియన్ (ఫైల్‌ఫోటో)
చెన్నై: కరోనా మహమ్మారి వ్యాప్తితో జనాలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా జాబ్ నుంచి తొలగించారు. ఈ క్రమంలో చెన్నైలో ఆసక్తికర కేసు ఒకటి వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం ఓ వ్యక్తి కోవిడ్ బారిన పడి మరణించాడు. అయితే అతడికి నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం ఇవ్వనందున ఆ ఉద్యోగికి లభించే బీమా ప్రయోజనాలు అందకుండా పోయానని ఆరోపిస్తూ.. ఇందుకు గాను సదరు కంపెనీ తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది మృతుడి భార్య. ఆ వివరాలు..
ఎంబీఏ చేసిన రమేష్ సుబ్రమణియన్(48) చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండేవాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా రోజుల వ్యవధిలోనే అతడిని విధుల నుంచి రిలీవ్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన రెండు నెలల తర్వాత అనగా జూన్, 2021లో అతడు కరోనా బారిన పడి మరణించాడు.
(చదవండి: కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!)
సుబ్రమణియన్‌కు నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడంతో అతడికి వచ్చే బీమా ప్రయోజనాలు రాకుండా పోయానని.. ఇందుకు కంపెనీనే బాధ్యత తీసుకోవాలని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది అతడి భార్య.
(చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం)
ఈ సందర్భంగా సుబ్రమణియన్ భార్య మాట్లాడుతూ.. ‘‘నా భర్త సంవత్సరానికి సుమారు 30 లక్షల రూపాయల జీతం పొందేవాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉద్యోగం నుంచి తొలగించిన రెండు నెలలోనే వైరస్ బారిన పడటంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఆయన చికిత్స కోసం 18 లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. జూన్ 11 న నా భర్త మరణించాడు. ఒకవేళ నోటీసు పీరియడ్ ఇవ్వడానికి అనుమతిస్తే.. అతనికి బీమా ప్రయోజనాలు లభించేవి. దాంతోపాటు మా కుటుంబానికి 1.5 కోట్ల రూపాయలకు పైగా వచ్చేవి’’ అని తెలిపారు.
ఈ క్రమంలో న్యాయమైన పరిహారం కోసం ఆమె కంపెనీకి లీగల్ నోటీసు పంపింది. తన లాంటి పరిస్థితి మరోకరికి రాకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నాని వెల్లడించింది. సదరు కంపెనీ సుబ్రమణియన్ కుటుంబానికి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించడానికి ముందుకు వచ్చింది. కానీ వారు అంగీకరించలేదు.
(చదవండి: ‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు)
అయితే సుబ్రమణియన్‌కు వేరే ఉద్యోగం రావడంతోనే రాజీనామా చేశాడని సదరు కంపెనీ తెలిపింది. అయితే సుబ్రమణియన్ కుటుంబం కంపెనీ వాదనను ఖండించింది. వారు ఈ సమస్యను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లారు."నియమం ప్రకారం నిర్ణీత సమయంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని" సూచిస్తూ కార్మిక శాఖ సదరు కంపెనీకి మెయిల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment