మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే కీలక ప్రకటనలు చేశారు. లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయడంతో పాటు, బహిరంగంగా మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు వీవీఐపీ అతిథుల సమక్షంలో మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు.
డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడామన్నారు. ధ్వని పరికరాలను నియంత్రించనున్నామని, ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
జనవరి 22న యూపీలోని అయోధ్యలో జరిగే నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్టంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నమని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment