న్యూఢిల్లీ: దేశంలో గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా, గత రెండు రోజులుగా రోజుకు 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 75,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,80,422 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 72,775 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,23,950 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,83,697 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.65 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.7 శాతం వద్ద స్థిరంగా ఉందని తెలిపింది. సెప్టెంబర్ 7 వరకు 5,06,50,128 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 10,98,621 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు వారాల్లోనే దాదాపు 1.33 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. తాజా 1,016 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 423 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,668 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేవ్ రాష్ట్రాల్లోనే దాదాపు 62 శాతం కేసులున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రతి మిలియన్ మందికి 36,703 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రతి పదిలక్షల జనాభాకు రోజుకు 758 పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించింది.
ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మకు పాజిటివ్
జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ)చీఫ్ రేఖా శర్మ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు మంగళవారం ఆమె స్వయంగా తెలిపారు. ప్రస్తుతం జలుబుతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment