సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను కేంద్రం జోడించింది. కోవిన్ పోర్టల్ డేటా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కొత్తగా తీసుకొస్తున్న ‘4-అంకెల సెక్యూరిటీ కోడ్ వల్ల ఈ సమాచారాన్ని తప్పుగా ఉపయోగించుకునే అవకాశాలను తగ్గించడంతోపాటు డేటా ఎంట్రీ ఎర్రర్స్ కూడా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రేపటినుంచి( మే 8) నుంచి ఈ ఫీచర్ అమల్లోకి వస్తుందని తెలిపింది.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నవారు నిర్దేశిత తేదీనాడు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళకపోయినప్పటికీ, వారికి వ్యాక్సినేషన్ జరిగినట్లు ఎస్ఎంఎస్ వచ్చిందన పలు ఆరోపణలో నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. కొత్తగా తీసుకొస్తున్న ఈ నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ ద్వారా ప్రజలకు కలిగే అసౌకర్యం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ -19 వ్యాక్సిన్ పొందడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులు ఈ టీకాను తీసుకోన్నారో లేదో కచ్చితంగా తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలపై వచ్చిన ఆరోపణలపై పరిశీలన జరిపినపుడు వ్యాక్సినేటర్ పొరపాటే దీనికి కారణమని వెల్లడైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు కోవిన్ యాప్‌లో ఈ నాలుగ అంకెల భద్రతా కోడ్ను ప్రవేశపెట్టినట్టు చెప్పింది.
నాలుగు అంకెల భద్రతా కోడ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?
టీకా స్లాట్ కోసం ఆన్‌లైన్ బుకింగ్ చేసిన పౌరులకు మాత్రమే ఈ క్రొత్త ఫీచర్ వర్తిస్తుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ మీద ఈ కోడ్ ముద్రించబడి ఉంటుంది. ఇది వ్యాక్సినేటర్‌కు తెలియదు. లబ్ధిదారుకు అపాయింట్‌మెంట్ ఖరారు అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్‌లో కూడా ఈ నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకుని, వ్యాక్సిన్ తీసుకునే సమయంలో చూపించాల్సి ఉంటుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులకు ఈ క్రింది సలహాలను జారీ చేసింది
పౌరులు తమ అపాయింట్‌మెంట్ స్లిప్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ ఎస్‌ఎంఎస్‌ను వ్యాక్సినేషన్ కేంద్రంలో చూపించాలి. ఇందులోని నాలుగు అంకెల కోడ్ చెప్పాలి. దీన్ని వ్యాక్సిన్ డోసును ఇవ్వడానికి ముందు వెరిఫయర్/వ్యాక్సినేటర్ కోవిన్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారు దీంతో వ్యాక్సినేషన్ స్టేటస్ సరైన విధంగా రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా నిర్ధారణ ఎస్ఎంఎస్ రాకపోతే టీకా కేంద్రం ఇన్‌ఛార్జిని సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment