న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో ‘కోవిన్’ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ, అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఈ ఆన్‌లైన్ వేదిక వీలు కల్పిస్తుందని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
‘ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ టు కంబాట్ కోవిడ్–19’ చైర్మన్ రామ్ సేవక్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం కూడా ఇందులో పాల్గొంది. టీకా పంపిణీకి ప్రాతిపదికగానే కాకుండా, బ్యాక్‌అప్‌గా కూడా ‘కోవిన్’ సాఫ్ట్‌వేర్ సమర్ధవంతంగా పనిచేస్తుందని శర్మ తెలిపారు. సులువుగా వినియోగించేలా దీన్ని రూపొందించామన్నారు. ఇది ఆధార్ డేటాను కూడా వినియోగించుకుంటుందని, పౌరులంతా తమ ప్రస్తుత మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానించుకునేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. తద్వారా వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం అందించడం సులువవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment