బ్రిజ్​భూషణ్​కు షాక్​.. రౌస్‌ అవెన్యూ కోర్టు కీలక తీర్పు | Delhi Court Orders Framing Charges Against Brij Bhushan Sharan Singh | Sakshi
Sakshi News home page

బ్రిజ్​భూషణ్​కు షాక్​.. రౌస్‌ అవెన్యూ కోర్టు కీలక తీర్పు

Published Fri, May 10 2024 7:05 PM | Last Updated on Fri, May 10 2024 7:27 PM

Delhi Court Orders Framing Charges Against Brij Bhushan Sharan Singh

న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది.  

బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్‌ శాఖకు కోర్టు సూచించింది.  

గత ఏడాది జూన్‌లో
లైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్‌లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్‌పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఐపీసీ సెక్షన్‌లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.

1,500 పేజీల ఛార్జిషీట్‌లో
పోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్‌లో బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.

నో టికెట్‌
ఉత్తర్‌ ప్రదేశ్‌ కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్‌గంజ్‌ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్‌ భూషణ్‌ సింగ్‌ ఎంపీగా నామినేషన్‌ వేసే సమయంలో  10 వేలమంది  బ్రిజ్‌భూషణ్‌ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement