న్యూఢిల్లీ: హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలను తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని అభివర్ణించారు. కేవలం గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందంటూ లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో గెలిచే సత్తా బీజేపీకి లేదని ఆయన అన్నారు. సెంథిల్ కుమార్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే ఎంపీ ఉత్తర భారతీయులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాందీని ప్రశ్నించారు.
జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో సెంథిల్ కుమార్ మాట్లాడారు. మనం సాధారణంగా గోమూత్ర రాష్ట్రాలుగా పిలిచే ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుందని, ఈ విషయం ప్రజలు గుర్తించాలని అన్నారు. ‘‘మీరు(బీజేపీ) దక్షిణ భారతదేశానికి చేరుకోలేరు. అక్కడ మీకు విజయం దక్కదు. స్థానం లేదు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.
దక్షిణాదిన మేము బలంగా ఉన్నాం’’ అని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిస్తే తప్ప బీజేపీకి అక్కడ అధికారం దక్కదని తేల్చిచెప్పారు. దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చెలాయించే సాహసాన్ని బీజేపీ కలలో కూడా చేయలేదని పేర్కొన్నారు. సెంథిల్‌కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో డీఎంకే పతనం ప్రారంభమైందని, ఆ పార్టీ నేతల అహంకారమే ఇందుకు కారణమని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ నిర్వాకం వల్లే చెన్నై నగరం నీట మునుగుతోందని విమర్శించారు. పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నామలై గుర్తుచేశారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? అని కర్ణాటక మాజీ మంత్రి సి.టి.రవి నిలదీశారు. భారతీయులను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అవమానిస్తున్నాయని మండిపడ్డారు.
సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం డిమాండ్ చేశారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా తదితరులు తప్పుపట్టారు. మరోవైపు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు చేయాలని, పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సభ గౌరవాన్ని కాపాడాలి: ఓం బిర్లా
లోక్‌సభలోకి ఎంపీలు ప్లకార్డులు తీసుకురావడం పట్ల స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలని, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. తనను కించపర్చేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ సభ్యుడు డానిష్ అలీ సోమవారం సభలో ప్లకార్డును మెడకు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ ఘటనపై స్పీకర్ మంగళవారం సభలో స్పందించారు. సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం సరైంది కాదని హితవు పలికారు. నియమ నిబంధనలకు సభ్యులంతా కట్టుబడి ఉండాలని చెప్పారు.
సెంథిల్ కుమార్ క్షమాపణ
లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ క్షమాపణ చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావించానని, ఇందులో భాగంగా ఒక వాక్యాన్ని సరైన రీతిలో ఉపయోగించలేదని పే ర్కొన్నారు. తనకు ఎలాంటి దు రుద్దేశం లేదన్నారు. తన మాటలకు తప్పుడు అర్థాలు ప్రచారంలోకి వస్తుండడంతో క్షమాపణ కోరుతున్నానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment