సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఆందోళన నేడు తీవ్రమైన విషయం తెల్సిందే. కేంద్రంతో జరిపిన పలు విడతల చర్చలు విఫలమవడంతో దేశవ్యాప్తంగా రైతులు సోమవారం నాడు ఎక్కడికక్కడ మహా ధర్నాలకు దిగగా, ప్రధానంగా పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు, రైతు నాయకులు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయ రంగం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళుతుందని, రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే వ్యవసాయోత్పత్తుల ధరలను నిర్ణయించే అధికారం కూడా వారి చేతుల్లోకి వెళుతుందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తుండగా, అలాంటి ప్రమాదం లేకుండా రాష్ట్రాల పరిధిలోని ‘అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ (ఏపీఎంసీ)’ చట్టాలు రక్షిస్తాయని కేంద్రం భరోసా ఇస్తోంది.
ఏపీఎంసీ లాంటి చట్టం లేని కేరళ విషయంలో ఏం జరుగుతుందో ఆలోచించారా? ఈ అంశంపై ఇరువర్గాలు చర్చలు జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో ప్రధానంగా సాగుచేసే టీ, కాఫీలతోపాటు రబ్బర్ పరిశ్రమకు కూడా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే బోర్డులు ఉన్నాయి. ఇతర వ్యవసాయోత్పత్తులకు నియంత్రణకు, మార్కెటింగ్‌కు ఎలాంటి చట్టాలు లేకపోవడం వల్ల ఆ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవసాయం మొదలైంది.
కేరళలో ప్రధానమైన తేయాకు పరిశ్రమలోకి బడా కార్పొరేట్ కంపెనీలు రావడంతో ఆ రంగంలో మధ్య, సన్నకారు రైతులకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. ఇక బడా కాఫీ కార్పొరేట్ కంపెనీలు 1998 సంవత్సరం వరకు నేరుగా రైతుల నుంచి కాఫీ గింజలను సేకరించడం వల్ల రైతులకు నష్టం వాటిల్లలేదు. 1998లో కాఫీ గింజల సేకరణ నుంచి కాఫీ బోర్డు తప్పుకోవడంతో వారి నుంచి కాఫీ గింజలను సేకరించేందుకు దళారులు, చిన్న ట్రేడర్లు, కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. నాటి నుంచి కాఫీ తోటల రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది.
అంతర్జాతీయంగా టీ, కాఫీ, రబ్బర్, ఇతర మసాలా దినుసులకు మార్కెట్ ఉండడంతో రాష్ట్ర రైతులు ప్రయోజనాలకన్నా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు ముఖ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మండల స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment