న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్ల దాడులతో రణరంగంగా మారిన ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. దాదాపు 212 మందితో టెల్ అవివ్ నుంచి బయలుదేరిన మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విమానంలో వచ్చిన భారతీయులకు ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వారికి స్వాగతం పలికారు. కరచాలనం చేశారు.
ఇజ్రాయెల్‌లో తమకు ఎదురైన భయానక అనుభవాలను భారతీయులు పంచుకున్నారు. సైరన్ల మోతతో నిద్రలేచేవాళ్లమని, ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపామని, షెల్టర్లలో తలదాచుకున్నామని శశ్వంత్ సింగ్ అనే వ్యక్తి చెప్పాడు. ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీకి చేరుకున్నాడు. తమను క్షేమంగా స్వదేశానికి చేర్చిన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా రెండో విమానం శుక్రవారం సాయంత్రం టెల్ అవివ్ నుంచి బయలుదేరింది. శనివారం భారత్‌కు చేరుకోనుంది.
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment