స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతకు సుప్రీంకోర్టు నో చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది.అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని తెలిపింది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశ చెందారు. అయితే తాము ఇక్కడితో ఆగిపోలేదని.. మళ్లీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న అనన్య కోటియా వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టే ఇందుకు కారణం.
తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అనన్య కోటియా, అతని భాగస్వామి అయిన న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా నేడు సుప్రీంకోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఉత్కర్ష్ సక్కేనా మోకాలిపై నిలబడి ఉండి.. అనన్యకు ఉంగరాన్ని తొడిగాడు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
చదవండి: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
Yesterday hurt. Today, @utkarsh__saxena and I went back to the court that denied our rights, and exchanged rings. So this week wasn't about a legal loss, but our engagement. We'll return to fight another day. pic.twitter.com/ALJFIhgQ5I
— Kotia (@AnanyaKotia) October 18, 2023
న్యాయపరంగా ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ.. భవిష్యత్తులో సమాన హక్కులు, గుర్తింపు కోసం తమ పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పంతో నిశ్చితార్థాన్ని జరుపుకున్నట్లు ఈ జంట వెల్లడించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మమ్మల్ని బాధించింది. అయినా నేడు మేము మా హక్కులను నిరాకరించిన అదే కోర్టు ప్రాంగణానికి తిరిగి వచ్చి నేను ఉత్కర్ష్ సక్కేనా ఉంగరాలు మార్చుకున్నాం. ఈ వారం మా వివాహాల చట్టబద్దతపై ఎదురుదెబ్బ తగిలిన విషమం గురించే కాదు మా నిశ్చితార్థం గురించి కూడా.. మరో రోజు పోరాడేందుకు తిరిగి వస్తాం’ అని అనన్య ట్వీట్ చేశారు.
కాగా స్వలింగ వివాహాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేన రాజ్యాంగ ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.
ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్ స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలియజేయగా.. జస్టిస్ కే రవింద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహచ జస్టిస్ హిమా కోహ్లి నిరాకరించారు. అయితే, స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది.
అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్‌జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment