న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్‌ఎస్‌పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి.
కమిటీ వేసి... అంతలోనే
1958లో ఏఎఫ్‌ఎస్‌పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్‌లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్‌ఎస్‌పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది.
ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్‌ఎస్‌సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్‌పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment