అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాం«దీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్‌లో కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ శుక్రవారం తోసిపుచ్చారు. ఆ శిక్షను నిలుపుదల చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. ‘‘రాహుల్ గాం«దీపై 10కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి కింద కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేయడానికి తగిన కారణాలు ఏమీ లేవు’’అని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుందో అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు రాహుల్ గాం«దీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే.
రాహుల్ గొంతు నొక్కేయడానికి కొత్త టెక్నిక్కులు : కాంగ్రెస్
గుజరాత్ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాహుల్ అన్నీ నిజాలు మాట్లాడుతూ ఉండడంతో ఆయన గొంతు నొక్కేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నిక్కులు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేయడం తీవ్ర అసంతృప్తికి లోను చేసిందని, కానీ తాము ఊహించిన తీర్పే వచి్చందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కుట్రలకు ఎవరూ భయపడడం లేదన్నారు.
పార్లమెంటులో రాహుల్ గొంతు నొక్కేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించిన ఖర్గే రాహుల్ గాంధీ న్యాయం కోసం , నిజం కోసం తన పోరాటం కొనసాగిస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఇలాంటి తీర్పు రావడం పట్ల తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ వంటి రాష్ట్రం నుంచి న్యాయం జరుగుతుందని మేము ఎలా భావిస్తాం. ఈ తీర్పులు రాసేవారు, కోర్టుల్లో పిటిషన్‌లు వేసేవారంతా ఒక్కటి గుర్తు ఉంచుకోవాలి. రాహుల్ లాంటి నాయకుడిని ఏ తీర్పులు , అనర్హత వేటులు ఆపలేవు’’అని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేసే మిషన్ నుంచి రాహుల్‌ని అడ్డుకునే శక్తి దేనికీ లేదన్నారు.
పరువు తీయడం కాంగ్రెస్‌కు అలవాటే: బీజేపీ
గుజరాత్ హైకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతించింది. ఇతరుల పరువు తీయడం , వారిని దూషించడం కాంగ్రెస్‌కు తరతరాలుగా వస్తున్న ఒక అలవాటేనని ఆరోపించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై క్షమాపణ కోరడానికి రాహుల్ నిరాకరించడం ఆయనకున్న అహంకారాన్ని సూచిస్తుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఇలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. రాహుల్ గాం«దీకి విధించిన శిక్ష అత్యంత కఠినమైనదని అంటున్న వారంతా అంత కఠినమైన నేరాన్ని ఆయన ఎందుకు చేశారో సమాధానం ఇవ్వాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment