మృతుడిని గుర్తించి, నిందితులను పట్టించి.. ఏఐ మరో అద్భుతం! | Delhi Police Solved The Case With The Help Of AI - Sakshi
Sakshi News home page

Delhi: మృతుడిని గుర్తించి, నిందితులను పట్టించి.. ఏఐ మరో అద్భుతం!

Published Thu, Jan 25 2024 12:08 PM | Last Updated on Thu, Jan 25 2024 12:21 PM

With the Help of AI Delhi Police Solved the Case - Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఉత్తర ఢిల్లీ పోలీసులు హత్య కేసును చేధించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు, హత్య కేసుతో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఏఐ సహకరించింది. 

సాధారణంగా హత్య కేసులలో మృతుని గుర్తింపునకు పోలీసులు ఆ మృతుల ఛాయాచిత్రాలను వార్తాపత్రికలలో ప్రచురింపజేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మృతుల ముఖాలు స్పష్టంగా కనిపించవు. అయితే ఉత్తర ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ సాయంతో మృతుని ముఖం స్పష్టంగా కనిపించేలా ఫొటోను తీయడంలో విజయం సాధించారు. 

వివరాల్లోకి వెళితే జనవరి 10న గీతా కాలనీ ఫ్లై ఓవర్ కింద ఓ యువకుని మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం వచిన నివేదికలో.. గొంతు నులిమి ఆ యువకుడిని హత్య చేసినట్లు వెల్లడయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదు. దీంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. 

ఈ నేపధ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. కొద్దిపాటి కసరత్తు తర్వాత మృతునికి సంబంధించిన స్పష్టమైన ఫొటో వెలికివచ్చింది. కళ్లు తెరచి ఉన్నప్పుడు మృతుని ముఖం ఎలా ఉంటుందనేది గుర్తిస్తూ, ఫొటో రూపొందించారు. దీనితో పోస్టర్లు వేయించిన పోలీసులు వాటిని వివిధ ప్రాంతాల్లోని గోడలపై అతికించారు. అలాగే వివిధ వాట్సాప్‌ గ్రూపులలో షేర్‌ చేశారు. 

దీంతో పోలీసుల కృషి ఫలించింది. ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఒక కాల్‌లో.. ఆ మృతదేహం తన అన్నయ్య హితేంద్ర ఫోటోనేనని ఒక వ్యక్తి తెలిపాడు. ఈ నేపధ్యంలో పోలీసులు హితేంద్ర ప్రొఫైల్‌ను పరిశీలించారు. అతని సన్నిహితులను విచారించి, కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

పోలీసుల విచారణలో హితేంద్ర.. ముగ్గురు యువకులతో ఏదో విషయమై గొడవ పడ్డాడని, వారు హితేంద్ర గొంతుకోసి ఆ మృతదేహాన్ని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద పారవేశారని తేలింది. ఆధారాలు దాచిపెట్టడంలో ఓ మహిళ కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులతోపాటు ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement