తిహార్ జైలు నుంచి దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించిన అధికారులు
కొంతకాలం నుంచి గైనిక్ సమస్యతో బాధపడుతున్న కవిత
తాజాగా జ్వరంతో ఇబ్బంది.. టెస్టులు చేయించి తిరిగి జైలుకు తరలింపు
ఆమె తరచూ అనారోగ్యం బారినపడుతుండటంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థత కు గురయ్యారు. మంగళవారం ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో జైలు అధికారులు ఢిల్లీలోని హరినగర్ లో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రభుత్వ ఆస్ప త్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
రక్త పరీక్షలు, గైనిక్ సంబంధ సమస్యల టెస్టులు చేయించి.. తిరిగి జైలుకు తరలించారు. నిజానికి కవితకు మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నాళ్లుగా గైనిక్ సమస్యతో సతమతం
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న కవితను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జ్యు డీషియల్ కస్టడీపై జైలులో ఉన్నారు. ఇటీవల ఆమె పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రా థోడ్ తదితరులు జైలులో కవితను పరామర్శించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.
అయితే కవిత గైనిక్ (స్త్రీ సంబంధిత) సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. మంగళవారం దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు సంబంధిత వైద్య పరీక్షలు చేశారని.. బుధవారం ఉదయానికల్లా రిపోర్టులను జైలు అధికారులకు పంపనున్నారని సమాచారం. తనకు గైనిక్ సమస్య ఉందని, బెయిల్ ఇవ్వాలని కవిత గతంలోనే పిటిషన్లు వేసినా.. కోర్టుల నుంచి సానుకూల తీర్పురాలేదు.
ఇంటి ఫుడ్ తినట్లేదంటున్న బీఆర్‌ఎస్ వర్గాలు
తిహార్ జైలులో ఉన్న కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. నాలుగైదు రోజులపాటు ఇంటి భోజనం చేసిన కవిత.. తర్వాత భోజనం తీసుకురావొద్దని కుటుంబ సభ్యులకు, తమ న్యాయవాదికి చెప్పారు. జైలులో అందరు ఖైదీలకు పెట్టే ఆహారాన్నే కవిత తీసుకుంటున్నారు.
కవిత కోసం ఇంటి నుంచి తీసుకొస్తున్న భోజనాన్ని తనిఖీ పేరుతో నలుగురైదుగురు చేతులు పెట్టి పరిశీలిస్తున్నారని.. అలా చేస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉండటంతోనే ఆమె ఇంటి భోజనం వద్దన్నారని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ఇంటి భోజనం తినకపోవడం, గతంలో ఉన్న గైనిక్ సమస్యల కారణంగా.. కవిత అస్వస్థతకు గురైనట్టు బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment