దళితుడిని అవమానించారంటున్న కాంగ్రెస్
చైర్‌పర్సన్ ప్యానెల్‌లో ఉండబోమని విపక్షాల హెచ్చరిక
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక తాజా వివాదానికి కారణమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఆరోపించింది.
తమ పార్టీ ఎంపీ కె.సురేశ్ అందరికంటే సీనియర్ అని, ఆయన ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని.. సంప్రదాయం ప్రకారం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్‌గా సురేశ్ ను నియమించాల్సిందని వాదిస్తోంది. దళితుడు కాబట్టే సురేశ్ ను బీజేపీ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది.
వాస్తవానికి 18వ లోక్‌సభలో కె.సురేశ్. వీరేంద్ర కుమార్‌లు ఇద్దరు ఎనిమిదేసి సార్లు ఎంపికైన, అందరికంటే సీనియర్ సభ్యులు. అయితే వీరేంద్ర కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో.. సురేశ్ ప్రొటెం స్పీకర్ కావాలి. కానీ బీజేపీ ఏడుసార్లు ఎంపీ అయిన మహతాబ్‌ను ఎంచుకుంది. ఆయనకు సహాయకారిగా ఉండేందుకు కె.సురేశ్, టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), రాధామోహన్ సింగ్, ఫగ్గన్‌సింగ్ కులస్తే (బీజేపీ)లతో ఛైర్ పర్సన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.
బీజేపీ వైఖరికి నిరసనగా ఛైర్ పర్సన్ ప్యానెల్‌కు దూరంగా ఉండే అంశాన్ని విపక్షాలకు చెందిన కె.సురేశ్, టి.ఆర్.బాలు, సుదీప్ బందోపాధ్యాయ్‌లు పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దళితుడు కాబట్టే సురేశ్ ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయలేదనే వాదనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. సురేష్ ఎనిమిదిసార్లు ఎంపిక అయినప్పటికీ.. ఆయన వరుసగా ఎన్నికైన ఎంపీ కాదని, 1998, 2004 లోక్‌సభల్లో ఆయన సభ్యుడు కాదని పేర్కొన్నారు. మరోవైపు మహతాబ్ ఏడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచారని, అందుకే ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా ఎంచుకున్నామని వాదించారు.
ప్రొటెం స్పీకర్ ఎంపికపై అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే గిరిజన మంత్రి కిరణ్ రిజిజును అవమానిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎదురుదాడికి దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను చూస్తున్న తొలి గిరిజన మంత్రిని అయినప్పటికీ కాంగ్రెస్ అబద్ధాలు, బెదిరింపులకు లొంగబోనని రిజిజు అన్నారు. ‘నిబంధనలను పాటిస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ ఇచి్చన.. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నినాదాన్ని అనుసరిస్తారని రిజిజు పేర్కొన్నారు.
సురేష్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీని 240 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా కాషాయపార్టీ ప్రజాస్వామ్యం, సంప్రదింపులు, పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రతిపక్షాలు అంటే ఏమిటనే దానిని అర్ధం చేసుకోవడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. నిరంకుశ బీజేపీ విపక్ష అభ్యరి్థని ప్రొటెం స్పీకర్‌గా కూడా చూడాలనుకోవడం లేదన్నారు. అందుకే ఫిరాయింపుదారు భర్తృహరి మహతాబ్‌ను ఎంచుకుందన్నారు. మహతాబ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేడీ నుంచి బీజేపీలోకి మారి.. ఆ పార్టీ టికెట్‌పై కటక్ నుంచి గెలుపొందారు.
అందరి దృష్టీ స్పీకర్ ఎన్నికపైనే...
18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలసిందే. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం 26న జరిగే స్పీకర్ ఎన్నికపై అందరి దృష్టీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment