
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి సరిహద్దు ఉగ్రవాదంలో పాలుపంచుకుంటున్న శక్తులకు ఇప్పుడున్నది మరో భారత్ అని తెలుస్తుందని, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగాండాలో భారతీయ సమాజంతో మాట్లాడుతూ..
మన దేశం కొత్త భారతదేశంగా రూపాంతరం చెందుతోంది. పాక్, చైనాల నుంచి దేశ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను అణచివేసే శక్తి ఈ నవ భారతావనికి ఉంది. యూరీ, బాలాకోట్ ఉదంతాలు ఈ విషయాన్ని చాటిచెబుతాయి. దశాబ్దాల తరబడి సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించింది. ఈ నూతన భారతదేశంతో ఇక వారి ఆటలు సాగవన్న విషయం తెలిసి వస్తుంది అని జైశంకర్ పేర్కొన్నారు.
గత మూడేళ్లుగా చైనా సరిహద్దు ఒప్పందాల అతిక్రమణలకు పాల్పడుతోందని, భారీగా దళాలను రంగంలోకి దింపుతోందని జైశంకర్ ఆరోపించారు. కానీ ఇవాళ భారత సైన్యం క్లిష్ట పరిస్థితుల్లో సైతం, అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రాల్లోనూ సన్నద్ధత చాటుతోందన్నారు. గతంలో మాదిరి కాదు.. ఇప్పుడు భారత సైనికులకు ఇప్పుడు పూర్తి మద్దతు ఉంది. వారి వద్ద సరైన ఆయుధాలు ఉన్నాయి. తగిన మౌలిక సదుపాయాలు, వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి అని జైశంకర్ స్పష్టం చేశారు.
స్వీయ ప్రయోజనాలకు భంగం కలిగితే ఇప్పటి భారతదేశం ఎంతమాత్రం ఉపేక్షించదన్న విషయాన్ని తక్కిన ప్రపంచం గుర్తించాలని అన్నారు. ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలి? ఎవరి నుంచి చమురు కోనుగోలు చేయకూడదు? వంటి అంశాలను ఇప్పుడు మనకు ఎవరూ నిర్దేశించలేరని, భారత్ ను ఒత్తిడికి గురిచేసే శక్తులేవీ లేవని జై శంకర్ ఉద్ఘాటించారు.ఇవాళ భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment