
చండీగఢ్: మొబైల్ ఫోన్ స్నాచింగ్‌ను సమర్థంగా అడ్డుకుని, ఓ దొంగను కటకటాల్లోకి నెట్టిన పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కుసుమ్ కుమారి (15) పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కుసుమ్ కుమారి ధైర్యం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను సాహస బాలికగా పేర్కొన్న జలంధర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ ఆమె పేరును జాతీయ, రాష్ట్రస్థాయి సాహస అవార్డులకు పంపిస్తామని చెప్పారు. ఇక కుసుమ్ కుమారి సాహసానికి మెచ్చిన సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరీ ఆమెకు రూ.51 వేల నజరానా ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఈ సాయం చేస్తున్నానని తెలిపారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి సంబంధించి కుసుమ్ కుమారి ఫొటోను వాడుకుంటామని చెప్పారు.
దొంగకు మూడు రోజుల రిమాండ్
కాగా, కుసుమ్ కుమారి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా దొంగలు అవినాష్ కుమార్ (22) అలియాస్ అషు, వినోద్ కుమార్ బైక్‌పై ఆమెను వెంబడించారు. చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కుసుమ్ కుమారి వారిపై సివంగిలా దూకి.. దొంగలకు చుక్కలు చూపించింది. ఫోన్ లాక్కుని బైక్‌పై కూర్చున్న అవినాష్ కుమార్‌ను అమాంతం పట్టేసుకుంది. ఈక్రమంలో ఆ దొంగ కుసుమ్ కుమారి చేతిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
అయినా, ఆమె వెనకడుగు వేయలేదు. అంతలోనే దారినపోయేవారు అక్కడకు చేరుకుని దొంగను పట్టుకున్నారు. మరో దొంగ బైక్‌పై ఉడాయించాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక నిందితుడు అవినాష్ కుమార్‌కు న్యాయస్థానం మూడు రోజుల రిమాండ్ విధించిందని జలంధర్ డివిజన్ నెంబర్-2 ఎస్‌ఐ జితేంతర్ పాల్ సింగ్ చెప్పారు. రెండోవాడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, దొంగతనం కేసులు పెట్టామని తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా.. గాయాలపాలైన సాహస బాలికకు జోషి ఆస్పత్రి ఉచితంగా చికిత్స అందిస్తుండటం అభినందనీయం.
#Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr
— The Tribune (@thetribunechd) September 1, 2020
Comments
Please login to add a commentAdd a comment