ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమయ్యింది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళుతున్నారు. తాజాగా వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాట(Stampede) కారణంగా ఒక మహిళ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రమాదం బారినపడ్డారు. అయితే వారు రైలు ఢీకొనకుండా తృటిలో తప్పించుకోగలిగారు. ఇతర ప్రయాణికులు వారిని కాపాడారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.
వివరాల్లోకి వెళితే ప్రయాగ్‌రాజ్-ఝాన్సీ రింగ్ రైలు(Prayagraj-Jhansi Ring Train) సోమవారం రాత్రి ఒరై నుండి ఝాన్సీకి చేరుకుంది. ప్రయాణీకులు దిగిన తర్వాత, రైలును ప్లాట్‌ఫామ్ నంబర్ ఎనిమిదిలోనికి తీసుకెళ్తున్నారు. అయితే మొదటి ప్లాట్‌ఫారమ్ నుండి రైలు రావడం చూసి, ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఆతృతలో కదులుతున్న రైలులోకి ఎక్కడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు ప్రయాణికులు కింద పడిపోయారు. దీనిని గమనించిన డ్రైవర్ రైలును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రింగ్ రైలు ఝాన్సీకి చేరుకుందని స్టేషనలో ప్రకటన రాగానే.. ప్రయాణికులు రైలు వెళ్లిపోతున్నదని భావించి కదులుతున్న రైలులోనికి ఎక్కారని రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ సింగ్ తెలిపారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. ఈ సంఘటన తర్వాత రైల్వే సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ఉదయం 8:30కే కోటిమందికిపైగా పుణ్యస్నానాలు
Comments
Please login to add a commentAdd a comment