సాక్షి, బనశంకరి (కర్ణాటక): పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చే సిబ్బందిని సహించేదిలేదని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. బుధవారం మైసూరురోడ్డులోని సీఏఆర్ కేంద్ర కార్యాలయంలో నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.56 కోట్ల విలువైన సొత్తు ప్రదర్శన, వారసుదారులకు అప్పగింతలో హోంమంత్రి పాల్గొని మాట్లాడారు. రౌడీలతో, నేరకార్యకలాపాలకు పాల్పడేవారితో ఎవరైనా పోలీసులు చేతులు కలిపితే ఊరుకోబోమని, అలాంటి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచుతామన్నారు.
కొందరి వల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోందన్నారు. పోలీసులు నేరగాళ్లను మట్టికరిపించాలి తప్ప నేరస్తులతో కుమ్మక్కు కారాదని సూచించారు. కొందరు పోలీసులు హత్యకేసుల్లో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వినబడుతున్నాయని, ఇలాంటివి సహించేది లేదని తెలిపారు. బాగా పనిచేసేవారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో రికవరీ చేసిన రూ.56 కోట్లు విలువచేసే వాహనాలు, బంగారం, ఇతర విలువైన సామగ్రిని, రూ.32 కోట్ల డ్రగ్స్‌ను ప్రదర్శించారు. సొత్తును సొంతదారులకు అప్పగింతను ప్రారంభించారు.
సవాల్‌గా మారిన భద్రత: కమిషనర్
పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ మాట్లాడుతూ వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రజలు బెంగళూరుకు వచ్చి స్థిరపడటంతో వారికి భద్రత కల్పించడం సవాల్‌తో కూడుకున్న విషయమన్నారు. డ్రగ్స్‌ను, గూండాగిరీని అడ్డుకట్టకు కఠినచర్యలు తీసుకుంటున్నామని, నగరంలోని అఫ్గానిస్తాన్లకు పూర్తి భద్రతను కల్పిస్తామని చెప్పారు. సీనియర్ ఐపీఎస్‌లు సౌమేందు ముఖర్జీ, మురుగన్, సందీప్ పాటిల్, రవికాంతేగౌడ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment