కోల్‌కతా : చనిపోయిన భర్త వీర్యంపై పూర్తి హక్కులు విధవరాలైన భార్యకు మాత్రమే ఉంటాయని కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తుది తీర్పును వెలువరించింది. 2020 మార్చిలో ఓ తండ్రి.. ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో దాచిన చనిపోయిన కుమారుడి తాలూకూ వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ వీర్యం ధ్వంసమైనా లేదా నిరుపయోగమైనా తమ వంశం నాశనం అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య జనవరి 19న దీనిపై విచారణ చేపట్టారు. ‘‘ తండ్రీ కొడుకుల సంబంధం ఉన్నంత మాత్రాన పిటిషనర్( చనిపోయిన వ్యక్తి తండ్రి) వీర్యాన్ని పొందటానిక ఎలాంటి ప్రాథమిక హక్కులను కలిగిలేరు. చనిపోయిన వ్యక్తి వీర్యం కేవలం అతడి భార్యకు మాత్రమే సొంతం. ఆమెకు మాత్రమే దానిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఈ విషయంలో కోర్టు ఆమెను ఏ విధంగానూ ఆదేశించలేదు’’ అని స్పష్టం చేశారు. ( ఈ సమయంలో పేమెంట్స్ చేయొద్దు )
కాగా, కోల్‌కతాకు చెందిన పిటిషనర్ కుమారుడు తలసేమియాతో బాధపడేవాడు. ఢిల్లీ హాస్పిటల్‌లో ఇందుకు చికిత్స కూడా తీసుకునేవాడు. 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2018లో అతడు మరణించాడు. అయితే మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని దాచారు. ఈ నేపథ్యంలో స్పెర్మ్ బ్యాంకులోని తమ కుమారుడి వీర్యాన్ని రెండేళ్ల ఒప్పందకాలం ముగిసేవరకు భద్రంగా ఉంచాలని తల్లిదండ్రులు బ్యాంకుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పెర్మ్ బ్యాంక్.. వీర్యాన్ని అతడి భార్య గర్బం దాల్చడానికి ఉపయోగించాలన్నా.. లేక, వేరే వాళ్ల కోసం వాడాలన్నా.. పాడేయాలన్నా అది కేవలం భార్య అనుమతితోటే సాధ్యమవుతుందని తెలిపింది. దీంతో వారు తమ కోడల్ని వీర్యం విషయమై నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వవల్సిందిగా కోరారు. ఇందుకు ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment