సాక్షి, హైదరాబాద్: దేశంలో అయితే జుమ్లా.. లేదంటే హమ్లా అన్నట్లు మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తన సోదరి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు పంపిన పరిణామంపై ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
దేశాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోంది. మోదీ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలుబొమ్మ. ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీఆర్‌ఎస్‌పై ఉసిగొల్పుతోంది. మా ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ నోటీసులు అందాయి. కానీ, అవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. మోదీ సమన్లకు ఎవరూ భయపడరు. దేశంలో ఏదో జరుగుతుందంటూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది కేంద్రం.
కవిత విచారణకు వెళ్తుంది. విచారణకు వెళ్లే దమ్ము మాకుంది. ఎమ్మెల్యేలను కొనబోయి స్టే తెచ్చుకున్న బీఎల్ సంతోష్‌లాగా కాదు మేం. ఆయన ఓ దగుల్బాజీ. ఇక్కడి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని స్వామీజీలను పంపాడు. ఇక న్యాయవ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జడ్జిలలో కొంతమంది బీజేపీ వాళ్లు ఉండొచ్చు. కానీ, కొందరు మంచి జడ్జిలూ ఉన్నారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటాం. ఈడీ, సీబీఐ వేటకుక్కల్లాంటి సంస్థలు.. బీజేపీకి అనుబంధ సంస్థలు అని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. కవిత కేసే మొదటిది, చివరిది కాదని.. ఇకపై తమ పార్టీ నేతలను వేధిస్తారని చెప్పారాయన.
.. ఒక ఇంజన్ ప్రధాని.. మరో ఇంజన్ అదానీ.. ఇదే బీజేపీ డబుల్‌ఇంజన్ నినాదమంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. గౌతమ్ అదానీ, ప్రధాని మోదీ బినామీ అని ఓ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. అక్రమంగా పోర్టులను కట్టబెట్టారు. ఎల్‌ఐసీ డబ్బులు ఆవిరైతే.. ప్రధాని ఉలకడు, పలకడు. దాదాపు రూ. 13 లక్షల కోట్లు ఆవిరైనా మోదీ, నిర్మల స్పందించరు. గుజరాత్‌లో ముంద్రా పోర్టులో వేల కోట్ల హెరాయిన్ పట్టుబడితే స్పందించరు. నిబంధనలు కాదని అదానీకి పోర్టులు కట్టబెడతారు. గుజరాత్‌లో కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా చనిపోతే పట్టించుకోరు. ఇవి స్కాంలు కాదా? అయినా అదానీపై కేసులు ఉండవని కేంద్రంపై మండిపడ్డారాయన. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. కానీ, ఎలాంటి కేసు పెట్టరు.
మోదీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలపై అక్రమంగా కేసులు పెట్టారు. దర్యాప్తు సంస్థల 95 శాతం దాడులు విపక్షాల మీదే ఎందుకు?. బీజేపీ వాళ్ల మీద పెట్టిన కేసులు ఏమవుతున్నాయి? ఎందుకు నీరుగారిపోతున్నాయి? అని నిలదీశారు కేటీఆర్. గత తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా?.. చందాల కోసం దందాలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా?. నీతిలేని పాలనకు కేంద్రం తీరు పర్యాయపదంగా మారిందని విమర్శించారు కేటీఆర్.
Comments
Please login to add a commentAdd a comment