లఖీంపూర్ ఖేరి: నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖీంపూర్ ఖేరి సంఘటనలో నిందితులపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మంది నిందితులపై జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, నేరపూరిత కుట్ర, సంబంధిత సెక్షన్ల కింద అభియాగాలు మోపింది.
నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148(అల్లర్లు), 149(చట్టవిరుద్ధంగా గుమికూడడం), 302(హత్య), 307(హత్యాయత్నం), 326(ఆయుధాలతో గాయపర్చడం), 427, 120బీతోపాటు మోటార్ వాహన చట్టంలోని 177 కింద అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్ వర్మ అభియోగాలు నమోదు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయట ఉన్న 14వ నిందితుడు వీరేంద్ర శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 అభియోగాలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రాతోపాటు కొందరు నిందితులపై ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతుల దాడిలో ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ
Comments
Please login to add a commentAdd a comment