
అయోధ్య: అయోధ్యలో వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానించింది. అద్వానీ, జోషి ఇద్దరూ రామమందిర నిర్మాణం కోసం విశేష కృషి చేశారు.
“జనవరి 22, 2024న అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రామమందిర ఉద్యమానికి ఆద్యులు లాల్ కృష్ణ అద్వానీ, డా. మురళీ మనోహర్ జోషిలను ఆహ్వానించారు. తాము అన్ని విధాలా కృషి చేస్తామని సీనియర్ నాయకులు ఇద్దరూ చెప్పారు." అని విశ్వహిందూ పరిషత్ సభ్యుడు అలోక్ కుమార్ తెలిపారు.
ఎల్‌కే అద్వానీ (96), మురళీ మనోహర్ జోషి (89) ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా రామాలయ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయస్సును పరిగణనలోకి తీసుకుని, వారిని రావద్దని మొదట అభ్యర్థించారు. ఇందుకు వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. కానీ తాజాగా ఈ పరిణామాలు జరిగాయి.
జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్ రాయ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment