ప్రధాని మోదీపై ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు
నందుర్బార్: ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే గొప్ప నేతంటూ మోదీని బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తుండగా ఆయన మాత్రం తనను వేధిస్తున్నారంటూ చిన్నా పిల్లాడిలా ఏడుస్తున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మాదిరిగా ధైర్యసాహసాలను అలవర్చుకోవాలని ప్రియాంక ఉద్బోధించారు.
శనివారం ప్రియాంక మహారాష్ట్రలోని నందుర్బార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ‘అవినీతిపై ఒంటరి పోరాటం సాగిస్తున్నట్లు మోదీ చెప్పుకుంటున్నారు. ఆయన వద్దే అధికారం యావత్తు కేంద్రీకృతమై ఉంది. మోదీ అందరి కంటే గొప్పనేత అనీ, ప్రపంచ నేతల మద్దతు ఆయనకు ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, మోదీ మాత్రం తనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు వేధింపులకు పాల్పడుతున్నాయంటూ ఎన్నికల సభల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి.
కానీ, ఆయనే స్వయంగా ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలి మోదీజీ, ఇది ప్రజా జీవితం. ప్రధాని పదవిని తక్కువ చేయొద్దు’ అని హితవు పలికారు. ‘దుర్గామాతలా వ్యవహరించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి నేర్చుకోండి. ఆమె పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశారు. ఆమె మాదిరిగా ధైర్యం, కృతనిశ్చయం కలిగి ఉండండి. కానీ, జాతి వ్యతిరేకి అంటూ ఇందిరను తిట్టిపోసే మీరు, ఆమె నుంచి నేర్చుకునేందుకు ఏముంటుంది?’ అని ప్రియాంక అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం నందుర్బార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో..తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment