ముంబై నార్త్ సెంట్రల్‌లో టఫ్ ఫైట్
హ్యాట్రిక్ కోసం బీజేపీ, పట్టు కోసం కాంగ్రెస్
ముంబై నార్త్ సెంట్రల్. మినీ ముంబైగా పేరొందిన లోక్‌సభ స్థానం. ఆకాశాన్నంటే హార్మ్యాలతోపాటు మురికివాడలు ఇక్కడి ప్రత్యేకత. సెల్రబిటీలతో పాటు వలస కారి్మకులకూ నివాస స్థానం. మే 20న ఐదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ నుంచి పార్టీ ముంబై చీఫ్ వర్షా గైక్వాడ్ బరిలో ఉన్నారు. గత రెండుసార్లూ గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తుండగా, తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఉవి్వళ్లూరుతోంది...
చట్టాలను సవరిస్తా..
ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్‌ను పక్కన పెట్టిన మరీ ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్‌కు టికెటిచి్చంది. పూనం తండ్రి, బీజేపీ దిగ్గజం ప్రమోద్ మహాజన్ హత్య కేసును వాదించింది ఉజ్వలే కావడం విశేషం! ‘‘ఆ సమయంలో పూనంను దగ్గరగా చూశా. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఆమె ఈసారి నా విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని నికమ్ చెబుతున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడి వంటి హై ప్రొఫైల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నికమ్ వాదించిన తీరును బీజేపీ ప్రచారంలో హైలైట్ చేస్తోంది.
‘‘రాజకీయాలు నా సెకండ్ ఇన్నింగ్స్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. అదే నన్ను గెలిపిస్తుంది’’ అని నికమ్ ధీమాతో ఉన్నారు. ‘‘ప్రజల కోసం మేలైన చట్టాలను రూపొందించడానికి కృషి చేయాలనుకుంటున్నా. పారిపోయిన నేరగాళ్లను భారత్‌కు తీసుకువచ్చేలా అప్పగింత చట్టాలను సవరించాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు. వంచిత్ బహుజన్ అగాడీ, మజ్లిస్ అభ్యర్థులు కూడా ముంబై నార్త్ సెంట్రల్‌లో పోటీలో ఉన్నారు.
రాజ్యంగ రక్షణ పోరాటం
ముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ తండ్రి ఏక్‌నాథ్ గైక్వాడ్ గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి వర్ష ప్రచారం ప్రారంభించారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన శివసేన సభ్యులు పారీ్టలో చీలిక తర్వాత ఉద్ధవ్ వెంటే ఉండటం కలిసొచ్చే అంశమని వర్షా అంటున్నారు. ‘‘ముంబై నార్త్ సెంట్రల్ తొలినుంచీ కాంగ్రెస్ కంచుకోట. ఈసారి నా విజయాన్ని పార్టీకి కానుకగా అందిస్తా’’ అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వలస ప్రజల నిలయం...
ముంబై ‘మినీ ఇండియా’ అయితే ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానం ‘మినీ ముంబై’. ఇందులో విలే పార్లే, చండీవలి, బాంద్రా, కలీనా, కుర్లా వంటి ప్రాంతాలున్నాయి. బాంద్రా, ఖర్‌లలో సినీ తారలు, ప్రముఖులు నివసిస్తారు. కుర్లాలో వలస కుటుంబాలు, కారి్మకులు ఎక్కువ. సుమారు 3 లక్షలమంది ఉత్తరాది రాష్ట్రాలవారు, లక్ష మంది దక్షిణాది ప్రజలు, 1.9 లక్షల మంది గుజరాత్, రాజస్థాన్ వాసులు నివసిస్తున్నారు. 3 లక్షలకు పైగా ముస్లింలున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, కాలుష్యం ఇక్కడి ప్రధాన సమస్యలు...
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment