Lok Sabha Elections 2024: నువ్వా నేనా...! | Lok Sabha Elections 2024: NDA and India alliances for election war | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: నువ్వా నేనా...!

Published Mon, Mar 18 2024 5:27 AM | Last Updated on Mon, Mar 18 2024 5:27 AM

Lok Sabha Elections 2024: NDA and India alliances for election war - Sakshi

సార్వత్రిక పోరుకు ఎన్డీఏ, ఇండియా కూటములు సై

సొంతంగా 370 సీట్లే లక్ష్యంగా బీజేపీ

267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు

కూటమికి పార్టిల ఝలక్‌తో కాంగ్రెస్‌ కుదేలు

జారుకున్న జేడీ(యూ), చెయ్యిచి్చన తృణమూల్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీ తలపడేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ), కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌ (ఇండియా) సిద్ధమయ్యాయి. వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, ఆ పార్టీని ఈసారి ఎలాగైనా మట్టికరిపించాలని కాంగ్రెస్‌ కృతనిశ్చయంతో ఉన్నాయి.

పేదలు, మహిళలు, రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని హామీల వర్షం కురిపిస్తున్నాయి. సొంతంగా 370కి పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న అధికార బీజేపీ ఇప్పటికే ఏకంగా 267 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది. ఇంకా కూటమి లెక్కలు తేలక కాంగ్రెస్‌ సతమతమవుతోంది. హోరాహోరీ పోరులో ఏ కూటమి నెగ్గేదీ తెలియాలంటే జూన్‌ 4న వరకు వేచి చూడాల్సిందే...

 అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం కదనోత్సాహంతో ఉన్న కమలదళం ఈ ఎన్నికల్లో భారీ లక్ష్యాలే నిర్ణయించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లు సాధించి 2019లో 303కు ఎగబాకిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 370కి పైగా సీట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ పక్షాలతో కలిపి 400లకు పైగా సీట్లు సాధించాలని భావిస్తోంది. ఎన్డీఏకు ప్రస్తుతం 335 మంది ఎంపీలుండగా వీరిలో బీజేపీ సొంత బలమే 290 (మిగతా ఎంపీలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి రాజీనామా చేశారు).

ఇక కాంగ్రెస్‌ 2019 ఎన్నికల్లో కేవలం 52 సీట్లకు పరిమితమైంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కలిపి 2019లో 144 సీట్లు మాత్రమే సాధించాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకి 40 శాతం, ఇండియా కూటమికి 35 శాతం ఓట్లొచ్చాయి. ఎన్డీఏకు ఈసారి ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాలను చుట్టేశారు. దక్షిణాదిన కూడా దాదాపు అన్నిచోట్ల          పర్యటించారు.

అసెంబ్లీలవారీగా కూటముల బలాబలాలు...
► దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్డీఏ పార్టిలు 18 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పార్టిలు 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.
► మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 1,791 మంది ఎన్డీయే కూటమికి చెందినవారు కాగా 1,653 మంది ఇండియా కూటమికి చెందినవారున్నారు.
► శాసన మండలి ఉన్న ఆరు రాష్ట్రాల్లోని మొత్తం 426 ఎమ్మెల్సీల్లో 105 మంది ఇండియాకు, 184 మంది ఎన్డీఏకు చెందినవారు.
► ఎమ్మెల్యేలపరంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా అత్యధిక జనాభా ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏది ఆధిపత్యం. కాగా పశ్చిమబెంగాల్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ల్లో ఇండియా కూటమిది పైచేయి.
► 2023–24 మధ్య తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదుచోట్ల ప్రభుత్వం మారింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, రెండింట కాంగ్రెస్‌ నెగ్గాయి. మిగతా మూడు రాష్ట్రాలను ప్రాంతీయ పార్టిలు చేజిక్కించుకున్నాయి.  

బీజేపీ లక్ష్యం 370 ప్లస్‌
ఎన్డీఏ భాగస్వాములతో సీట్ల పంపకాలను బీజేపీ శరవేగంగా తేల్చేస్తోంది...
► అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 80 లోక్‌సభ స్థానాలకు 2019లో 62 సీట్లు బీజేపీ సాధించిన ఈసారి 70 దాటాలని టార్గెట్‌ పెట్టుకుంది. మిత్రపక్షాల్లో అప్నాదళ్‌ (ఎస్‌)కు 5 సీట్లు, నిషాద్‌          పార్టికి ఒకట్రెండు కేటాయించవచ్చు. ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ ఐదు సీట్లు డిమాండ్‌ చేస్తున్నారు.
► మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను  26 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. అయితే సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ (అజిత్‌)తో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.
► 40 స్థానాలున్న బిహార్‌లో కనీసం 25 సీట్లులో పోటీ చేయనుంది. మిగతా స్థానాలను జేడీ(యూ), లోక్‌ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుషా్వహా రా్రïÙ్టయ లోక్‌ జనతాదళ్, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌)లకు కేటాయించే అవకాశముంది.
► 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో కొత్త మిత్రుడు జేడీ(ఎస్‌)కు 3 స్థానాలిచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. అక్కడ 2019 ఎన్నికల్లో 25 స్థానాలు చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
► అస్సాంలో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ, మిగతా చోట్ల మిత్రపక్షాలు అస్సాం గణ పరిషత్‌ (ఏజీపీ), యునైటెడ్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ (యూపీపీఎల్‌) పోటీ చేస్తారు.

లెక్కలు తేలక ‘హస్త’వ్యస్తం...
ఈసారి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించే లక్ష్యంతో భాగస్వాములతో కాంగ్రెస్‌ పొత్తు కసరత్తులు చేస్తోంది. ఒంటరిగా పోటీ చేసే రాష్ట్రాలు, మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగాల్సిన రాష్ట్రాలపై పీసీసీల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అంతర్గత నిర్ణయం మేరకు కర్ణాటక (28), గుజరాత్‌ (26), రాజస్థాన్‌ (25), ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), అస్సాం (14), చత్తీస్‌గఢ్‌ (11), హరియాణా (10), అరుణాచల్‌ప్రదేశ్‌ (2)ల్లో కాంగ్రెస్‌ ఒంటరి పోటీ చేయనుందని సమాచారం...
యూపీలో కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా చివరికి 17 స్థానాలకే పరిమితమవుతోంది. మిగతా చోట్ల ఇండియా కూటమి భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది.
► మహారాష్ట్రలో కనీసం 18 సీట్లలో బరిలో దిగాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మిగతా వాటిని మిత్రపక్షాలు ఎన్సీపీ (శరద్‌), శివసేన (యూబీటీ)లకు కేటాయించనుంది.
► పశి్చమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో మొత్తం 42 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేయనుంది.
► బిహార్‌లో జేడీ(యూ) జారుకోవడంతో కనీసం 25 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నా చివరికి 15 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. మిత్రపక్షం ఆర్‌జేడీ మాత్రం 7 నుంచి 9 సీట్ల కంటే ఇచ్చేది లేదంటోంది!
► తమిళనాట డీఎంకేతో పొత్తున్నా కాంగ్రెస్‌కు రెండుకు మించి సీట్లు దక్కడం కష్టమే.
► జార్ఖండ్‌లోని ఏడు చోట్ల పోటీ చేసి జేఎంఎంకు 4, ఇతర పక్షాలకు 3 ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి.
► కేరళలో 20 స్థానాల్లో 16 చోట్ల పోటీ చేసి వామపక్షాలకు 4 ఇవ్వనుంది.
► పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు కుదరకపోవడం, అకాలీదళ్‌ కూడా దూరమవడంతో మొత్తం 13 సీట్లలోనూ కాంగ్రెస్‌ పోటీ చేయనుంది.
► ఢిల్లీలో మాత్రం నాలుగు చోట్ల ఆప్, మూడుచోట్ల కాంగ్రెస్‌ బరిలో దిగనున్నాయి.

2019లో ఇలా...
2014లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా 2019 నాటికి 303కు పెరిగాయి. 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాలను చాలావరకు క్లీన్‌స్వీప్‌ చేసింది. 2019లో 31 శాతం ఓట్లు సాధించగా 2019లో 37.4కు పెంచుకుంది. 2019లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 353 ఎంపీల మద్దతుంది. కూటమి మొత్తం 40 శాతం ఓట్లు సాధించింది.

ఎన్డీఏ కూటమి బలం
బీజేపీ        290
జేడీ(యూ)        16
శివసేన        13
ఆర్‌ఎల్‌జేపీ        5
ఇతరులు        11  

2019లో ఇలా...
ప్రస్తుత ఇండియా కూటమి 2009 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో 347 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినప్పటికీ 161 సీట్లకే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టిల మధ్య త్రిముఖ పోటీయే ఇందుకు ప్రధాన కారణం. ఇక 2019 ఎన్నికల్లో ఇండియా కూటమి 38 శాతం ఓట్లకు, కేవలం 144 సీట్లకు పడిపోయింది.

ఇండియా కూటమి బలం
కాంగ్రెస్‌    48
డీఎంకే    24
టీఎంసీ    22
శివసేన (యూబీటీ)        6
ఎన్‌సీపీ (శరద్‌)        4
ఇతరులు        19

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement