ఒకవైపు చూస్తుంటే ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. అంత్యక్రియల కోసం కిలో మీటర్ల కొద్దీ క్యూ లైన్లు.. అయినవారికి ఆఖరి వీడ్కోలు పలకడానికి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఎదురుచూపులు.. భోపాల్, రాయ్‌పూర్, అహ్మదాబాద్, ముంబై ఎక్కడ చూసినా ఇదే దుస్థితి.. ప్రభుత్వాల అధికార లెక్కలకి, చితి మంటలపై కాలుతున్న శవాల సంఖ్యకి పొంతన లేదు.
భోపాల్: భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుంది కదా? వేలాది మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న విషవాయువు కల్లోలం. ఇప్పుడు కరోనా అదే విధంగా మధ్యప్రదేశ్‌లో ప్రజల ప్రాణాల్ని తీస్తోంది. అప్పట్లో ఏ స్థాయిలో శ్మశానాల దగ్గర అంత్యక్రియల కోసం క్యూలు ఉండేవో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని భడ్‌భాడా శ్మశాన వాటిక దగ్గర కోవిడ్ –19 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడకి గంటకి 30–40 మృతదేహాలను తీసుకువస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంబులెన్స్‌లు రోడ్డు మీదకి కొన్ని కిలోమీటర్ల వరకు లైనులో ఉన్నాయి. ‘‘మా బావగారు కరోనా మరణించడంతో ఇక్కడికి వచ్చాం. నాలుగైదు గంటలు వేచి చూసినా అంత్యక్రియలకు జాగా దొరకలేదు’’అని సంతోష్ రఘువంశి చెప్పారు.
లెక్కల్లో ఎంతో తేడా ..!
మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలున్నాయి. సోమవారం కరోనాతో రాష్ట్రంలో 37 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతూ ఉంటే, భోపాల్‌లో భడ్‌భాడా శ్మశానవాటికలోనే 37 మంది కోవిడ్ రోగులకి అంత్యక్రియలు జరిగాయి.. ఏప్రిల్ 8న 41 మంది కోవిడ్ రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే, రాష్ట్రవ్యాప్తంగా 27 మందే మరణించారని ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా ఏప్రిల్ 10న భోపాల్‌లో 56 మృతదేహాలకు అంతిమ సంస్కారం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 24 మందే మరణించారని ప్రభుత్వ గఱాంకాలు చెబుతున్నాయి.
ఏప్రిల్ 11న 68 కి అంత్యక్రియలు జరిగితే ప్రభుత్వం 24 అని, ఏప్రిల్ 12న 59ని దహనం చేస్తే ప్రభుత్వం 37 మరణించారని వెల్లడించింది. కోవిడ్ మృతుల అంశంలో తాము అన్నీ నిజాలే చెబుతున్నామని ప్రభుత్వం అంటోంది. అంత్యక్రియల కోసం క్యూలు పెరగడానికి కలప దొరకకపోవడమే కారణమని రాష్ట్ర వైద్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు. రోజుకి 40 నుంచి 45 మృతదేహాలను దహనం చేయాల్సి రావడంతో తాము చాలా ఒత్తిడికి లోనవుతున్నామని శ్మశాన వాటికలో పని చేసే ప్రదీప్ కానోజియా చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ ,ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ శ్మశాన వాటికలకు ఇస్తున్న సమాచారానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గణాంకాలకి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వాలు కరోనా మరణాలను దాచి పెడుతున్నాయన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క కరోనా రోగుల అవస్థలు
కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరాలనుకునే వారు బెడ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ, పాట్నా, బెంగుళూరు, అహ్మదాబాద్, ముంబై, పుణెలలో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. సామర్థ్యానికి మించి కోవిడ్ పేషెంట్లు వచ్చి చేరుతున్నారు. పట్నా ఎయిమ్స్ ఆస్పత్రిలో 112 బెడ్స్ నిండిపోయాయి. రుబాన్ ఆస్పత్రుల్లో 95 బెడ్స్ నిండిపోవడంతో కొత్త పేషెంట్లకు అవకాశం లేదు. ఫోర్డ్ ఆస్పత్రిలో 55 పడకలు, పరాస్ ఆస్పత్రిలో 48 పడకలు కోవిడ్ రోగులతో నిండిపోయాయి.
ఢిల్లీలోని కోవిడ్ రోగుల ప్రత్యేక ఆస్పత్రి లోక్‌నాయక్ ఆస్పత్రి, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒక్క బెడ్ కూడా ఖాళీగా లేదు. ఢిల్లీ ఆస్పత్రుల్లో 1177 బెడ్స్‌కి గాను 79 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులు అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి సరిపడా సిబ్బంది కూడా లేరు. బెంగళూరులోని కొన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకకపోవడంతో ఆస్పత్రి బయట ఉన్న బెంచీలపైనే రోగులు పడుకుంటున్నారు. పుణేలో కారిడార్లలోనే పేషెంట్లకు చికిత్స చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
గుజరాత్‌లోని జహగిరిపురా శ్మశాన వాటిక ముందు బారులు తీరిన మృతదేహాలతో కూడిన అంబులెన్స్‌లు
గుజరాత్‌లో రేయింబగళ్లు అంత్యక్రియలు
సాధారణ పరిస్థితుల్లో హిందువులు సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరు. కానీ కోవిడ్‌తో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో చేసేదేమీ లేక రాత్రి పూట కూడా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కేవలం సూరత్‌లోనే రాత్రిళ్లు 25 వరకు శవాలను దహనాలు చేస్తున్నారు. వడోదరాలో కూడా అదే పరిస్థితి నెలకొందని మున్సిపల్ చైర్మన్ హితేంద్ర పటేల్ చెప్పారు.
రాయపూర్‌లో కొత్తగా క్రిమేషన్ సెంటర్లు
కోవిడ్–19 మృతదేహాలకు అంత్య క్రియలు నిర్వహించలేక ఆస్పత్రులోనే గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్న వీడియో వైరల్ కావడంతో ఆ రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్ క్రిమేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కేవలం రాయపూర్‌లోనే ఒకేరోజు 150 మంది వరకు కరోనాతో మరణించారు. మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కొత్తగా 14 ఎలక్ట్రిక్ క్రిమేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment