చెన్నై: తమిళనాడులో నీట్ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. అయితే, సూర్య తమిళంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆంగ్లంలో అన్వయించుకోవడంలో జరిగిన పొరపాటు వల్లనే జస్టిస్ సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసిందని సూర్య ట్విట్టర్‌లో స్పందించారు.
కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారని, అయితే విద్యార్థులను మాత్రం నిర్భీతిగా వెళ్ళి పరీక్షలు రాయమని ఆదేశించడంలో నైతికత లేదని సూర్య ట్వీట్ చేసినట్లు జస్టిస్ సుబ్రమణ్యం తన లేఖలో పేర్కొన్నారు. అయితే సూర్య చేసిన ట్వీట్‌లో ‘‘అలాంటప్పుడు, నైతికత లేదు’’ అనే పదాలు లేవని, జడ్జి అన్వయం చేసుకోవడంలో పొరపాటుపడి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు సూర్యపై ఎటువంటి చర్యలు చేపట్టొద్దని, ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడ్డారని, ఒక దుర్ఘటనపై కళాకారుడి స్పందనను తీవ్రమైనదిగా పరిగణించరాదని ఆరుగురు మాజీ జడ్జీలు, కొందరు ప్రముఖ న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment