న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు.
వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది.
12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్‌ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment