జైపూర్: రాజస్థాన్ అజ్మీర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం పూర్తిగా చేవచచ్చినట్లుగా ఉందని, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియావాస్. అక్కడితో ఆగకుండా రాజస్థాన్లో జరగబోయే ఎన్నికల తర్వాత బీజేపీ ఇక్కడ భూస్థాపితమవుతుందని జోస్యం చెప్పారు.
ఎప్పుడూ విమర్శలేనా...? అభివృద్ధి గురించి మాట్లాడరా..?
అజ్మీర్ బహిరంగసభలో ప్రధాని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు రాజస్థాన్ ఆహార, పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియావాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఆయనకున్న అలవాటు ప్రకారం ఎప్పట్లాగే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి వెళ్లిపోయారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏదైనా ఉంటే అది చెప్పకుండా ఎపుడూ అదే పాత పాట పాడితే ఎలా? మీరు చేస్తోన్న అవినీతిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై వేటు వేశారు. అందుకే దానికి ప్రతిఫలంగానే కర్ణాటక ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అక్కడ మీకు కనీసం డిపాజిట్లయినా దక్కాయి. రాబోయే రాజస్థాన్ ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు దక్కవు సరికదా.. భూస్థాపితమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment