నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యానికి... | Navy successfully test fires surface-to-air missile | Sakshi
Sakshi News home page

నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యానికి...

Published Wed, Mar 8 2023 1:32 AM | Last Updated on Wed, Mar 8 2023 1:32 AM

Navy successfully test fires surface-to-air missile - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్‌ఎస్‌ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్‌ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్‌ బాంబులు, క్రూయిజ్‌ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది.

నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్‌ఎస్‌ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ), ఇజ్రాయిల్‌ ఎరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేస్తోంది. 

మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ –టు –ఎయిర్‌ మిస్సైల్‌ (ఎంఆర్‌ఎస్‌ఏఎం) ప్రత్యేకతలు
పరిధి: 70 కిలోమీటర్లు 
మార్గదర్శకత్వం: డ్యూయల్‌ (కమాండ్‌ –యాక్టివ్‌ రాడార్‌ సీకర్‌ (ఆర్‌ఎఫ్‌) 
నియంత్రణ: టీవీఎస్‌ అండ్‌ ఏరోడైనమిక్‌ 
ప్రొపల్షన్‌: డ్యూయల్‌ పల్స్‌ –సాలిడ్‌  మోటార్‌ 
వార్‌ హెడ్‌: ప్రీ–ఫ్రాగ్మెంట్‌ 
ప్రయాణ సమయం: 230 సెకన్లు 
పొడవు: 4500 మిల్లీమీటర్లు 
వ్యాసం: 225 మిమీ 
బరువు: 275 కిలోలు 
లాంచర్‌: షిప్‌/వాహనం (నిలువు) లాంచ్‌.  

భారత రక్షణ దళం శక్తివంతం 
‘ఆత్మనిర్భర్‌’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్‌ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు.

ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్‌ ఏరియల్‌ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్‌ఎస్‌ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్‌ పల్స్‌ రాకెట్‌ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్‌ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement