న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్‌లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు.
పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్‌ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్‌టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది.
దీంతో ఈ రూల్స్‌పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది.
కాగా.. బెంగాల్‌లోని హెచ్‌ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్‌లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు.
నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో..
Comments
Please login to add a commentAdd a comment