న్యూఢిల్లీ: ఢిల్లీలో తీన్‌మూర్తి భవన ప్రాంగణంలో ఉన్న ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ’ పేరును కేంద్ర ప్రభుత్వం ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మార్చింది. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ప్రభుత్వం గత ఏడాది ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చిన సంగతి తెలిసిందే. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరును ప్రైమ్‌మినిస్టర్స్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మారుస్తూ తీర్మానించినట్లు కేంద్ర సాంస్కృతిం శాఖ శుక్రవారం ప్రకటించింది.
నెహ్రూ నుంచి మోదీ దాకా ప్రధానుల వివరాలు, వారి ఘనత, దేశ అభివృద్ధిలో వారి పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఈ లైబ్రరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. సొసైటీ ఉపాధ్యక్షుడైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రూ తీన్‌మూర్తి భవన్‌లో 16 ఏళ్లకుపైగా 1964 మే 27న చనిపోయే దాకా ఉన్నారు. 1966లో ఇక్కడ ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ’ ఏర్పాటయ్యింది.
అల్పబుద్ధిని చాటుకున్న ప్రభుత్వం: కాంగ్రెస్
నెహ్రూ లైబ్రరీ పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అల్పబుద్ధిని చాటుకుందని అన్నారు. భవనాల పేరు మార్చినంత మాత్రాన మహోన్నత వ్యక్తుల పేరు ప్రఖ్యాతులను చెరిపివేయలేరని పేర్కొన్నారు. చరిత్ర లేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment