
హత్రాస్ తొక్కిసలాటపై భోలే బాబా ‘వేదాంతం’
లక్నో: హత్రాస్ తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని, అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరని భోలే బాబా అన్నారు. అందరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదని వేదాంతం వల్లెవేశారు. భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాటలో ఇటీవల 121 మంది మరణించడం తెలిసిందే.
బుధవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘పుట్టినవాడు ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. కాస్తా ముందూ వెనకా అంతే’ అన్నారు. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని పునరుద్ఘాటించారు. ‘జూలై 2 దుర్ఘటన తర్వాత నేను తీవ్ర నిరాశకు లోనయ్యా, కలత చెందా. కానీ జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. విషపూరిత రసాయనాలను స్ప్రే చేశారని నా న్యాయవాది, ప్రత్యక్షసాక్షులు చెప్పింది ముమ్మాటికీ నిజం. దీనివెనుక కచి్చతంగా కుట్ర ఉంది’ అని బాబా పేర్కొన్నారు.