మణిపూర్ అమానవీయ ఘటనపై పార్లమెంటులో చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఏ నిబంధన కింద చర్చించాలన్న దానిపై పీటముడి నెలకొంది. 267 కింద మణిపూర్‌పై రాజ్యసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిపి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనంతట తానుగా ఒక ప్రకటన చేయాలని విపక్ష పారీ్టలు పట్టుబడుతున్నాయి. దానికి బదులుగా నిబంధన 176 కింద చర్చకు సిద్ధమని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ రెండు నిబంధనలకున్న ప్రాథమికమైన తేడా చర్చా సమయం. నిబంధన 267 కింద సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటే, నిబంధన 176 కింద స్వల్పకాలిక చర్చ మాత్రమే జరుగుతుంది.
రూల్ 267
► రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) ప్రకారం రూల్ 267 కింద చర్చ సుదీర్ఘంగా సాగుతుంది. ఆ రోజు ఏదైనా అంశంపై చర్చకు సభ్యులు ముందుగా నోటీసులు ఇచ్చి ఉంటే రాజ్యసభ చైర్మన్ వాటిని పూర్తిగా రద్దు చేసి దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చకు అనుమతినిస్తారు. ఈ చర్చ సందర్భంగా సభ్యులు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. చర్చ ఎన్ని గంటలు కొనసాగించాలన్న దానిపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. చర్చ జరపడానికి తీర్మానం, దానిపై ఓటింగ్ వంటి వాటికి అవకాశం ఉంటుంది.
రూల్ 176
► స్వల్పకాలిక వ్యవధిలో ముగిసే చర్చలు 176 నిబంధన కింద జరుపుతారు. ఈ నిబంధన కింద రెండున్నర గంటలకు మించి చర్చ కొనసాగదు. ఈ నిబంధన కింద సభ్యుడెవరైనా అప్పటికప్పుడు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇవ్వొచ్చు. ఆ నోటీసులో చర్చకు గల కారణాలు వివరించాలి. ఆ నోటీసుకి మద్దతుగా మరో ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. రాజ్యçసభ చైర్మన్ చర్చకు అంగీకరించిన తర్వాత ఆ రోజైనా, ఆ మర్నాడైనా చర్చకు అనుమతినిస్తారు. ఈ చర్చకు సంబంధిత మంత్రి మాత్రమే సమాధానమిస్తారు. ఇదంతా రెండున్నర గంటల్లోనే ముగిసిపోతుంది. లాంఛనంగా తీర్మానం, దానిపై ఓటింగ్ వంటివి ఉండవు.
గతంలో 267 కింద చర్చ జరిగిందా ?
పార్లమెంటు రికార్డుల ప్రకారం రూల్ 267 కింద 1990 నుంచి 2016 వరకు 11 సార్లు చర్చలు జరిగాయి. 2016లో చివరిసారిగా పెద్ద నోట్ల రద్దుపై అప్పటి రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ రూల్ 267 కింద చర్చకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ నిబంధన కింద ఏ నోటీసును చైర్మన్ అనుమతించలేదు. గత శీతాకాల సమావేశాల్లో వాస్తవా«దీన రేఖ వెంబడి చైనా పెత్తనం పెరిగిపోవడం, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చించడానికి రూల్ 267 కింద విపక్ష సభ్యులు ఇచి్చన నోటీసుల్ని ఎనిమిది సార్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కార్ తోసిపుచ్చారు.
ఈ నిబంధన కింద చర్చకు అనుమతిస్తే సభలో గందరగోళం నెలకొనడం మినహాయించి సమగ్రమైన చర్చ జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. రోజంతా సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి అత్యవసరంగా చర్చ జరిపే ప్రజా ప్రాముఖ్యత అంశాలు ఉండవని కొందరు అధికార పక్ష ఎంపీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌పై స్వల్పకాలిక చర్చ జరిపి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమాధానమివ్వాలని అధికార పక్షం భావిస్తూ ఉంటే, ప్రతిపక్షాలు సుదీర్ఘంగా చర్చించాక ప్రధాని నరేంద్ర మోదీయే బదులివ్వాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఎవరికివారే మెట్టు దిగకపోవడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment