వారణాసి: గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ | PM Modi Varanasi Visit: Kashi Corridor Inauguration Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Modi Varanasi Visit: వారణాసి: గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ

Published Mon, Dec 13 2021 12:31 PM | Last Updated on Mon, Dec 13 2021 8:26 PM

PM Modi Varanasi Visit: Kashi Corridor Inauguration Highlights In Telugu - Sakshi

Updates:

► వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద క్రూజ్‌లో గంగా హారతిని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌, హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ పాల్గొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో దిగారు.

►కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. నేడు కాశీ విశ్వనాథ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతోందని మోదీ అన్నారు. కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ కేవలం గొప్ప భవన్‌ మాత్రమే కాదని భారతదేశ సనాతన సంస్కృతి, సంప్రదాయలకు చిహ్నమన్నారు. 

►కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తును తెలియజేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కాశీకి రావ‌డానికి నేటి త‌రం వాళ్లు గ‌ర్వంగా ఫీల‌వుతార‌న్నారు. ఇది ప్రాచీన‌, ఆధునిక సంస్కృత‌ల మేళ‌వింపు అన్నారు. కొత్త చ‌రిత్ర‌ను సృష్టించామ‌న్నారు. దీన్ని వీక్షించ‌డం మ‌న అదృష్ట‌మ‌న్నారు.

► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 3,000 మంది మత, ఆధ్యాత్మిక గురువులు, పూజారులు,  ఇతర ప్రముఖుల సమక్షంలో మోదీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించారు.

► కాశీలో ప‌ర్య‌టిస్తున్న ప్రధానిమోదీ గంగా న‌దిలో పుణ్య స్నానం చేశారు. ల‌లితా ఘాట్ వ‌ద్ద మోదీ జ‌ల‌త‌ర్ప‌ణం చేశారు. గంగా మాత‌కు పుష్పాలు అర్పించారు. సూర్య భ‌గ‌వానుడికి పూజ‌లు చేశారు.  కాషాయ వ‌స్త్రాల్లో.. గంగా జ‌లాన్ని తీసుకుని ఆయ‌న బాబా విశ్వ‌నాథుడి వ‌ద్ద‌కు వెళ్లారు. విశ్వ‌నాథుడికి ఆ జ‌లంతో అభిషేకం చేయ‌నున్నారు.

► పవిత్ర కాశీ విశ్వనాథుడి ఆలయ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను ప్రధాని మోదీ దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. రూ. 339 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు ప్రధాని మోదీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 23 కొత్త భవనాలను నిర్మించారు. ఇది వారణాసిలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ఒక మెగా ప్రాజెక్ట్‌.

► కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ కృతజ్జతలు తెలియజేశారు. అనంతరం నిర్మాణ కార్మికులపై పూలు చల్లి వారిని సన్మానించారు. కార్మికులతో కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు. కొద్దిసేపు ముచ్చటించి వారితో లంచ్‌  కూడా చేశారు.

► సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. కలల ప్రాజెక్ట్‌ కాశీ విశ్వనాథ థామ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. కాశీ చేరుకున్న ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు. 

► దివ్యకాశీ-భవ్య కాశీ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమం కోసం కాశీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తొలిదశలో భాగంగా 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 23 భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతోపాటు 3వేల మంది సాధువులు, ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలను ఆహ్వానించారు.

► దివ్యకాశీ-భవ్య కాశీ కార్యక్రమ వీక్షణకు దేశవ్యాప్తంగా 51వేల చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దేశంలోని ప్రముఖ శివాలయాలు, ఆశ్రమాల్లో ఎల్​ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. కాశీలో నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

వారణాసి: పవిత్ర వారణాసిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీవిశ్వనాథ్‌ కారిడార్‌ను ప్రధాని మోదీ సోమవారం జాతికి అంకితం చేయనున్నారు. ‘రూ.399 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ మొదటి దశ ప్రాజెక్టును సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పూజల అనంతరం ప్రధాని మోదీ ప్రారంభిస్తారు’అని ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఆదివారం తెలిపింది. కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం సాయంత్రం వారణాసిలో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని గంగా హారతిలో పాల్గొంటారు. దీంతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి గంగానదిలో పడవలో విహరిస్తూ వారితో ప్రధాని మాట్లాడతారని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌రాజ్‌ శర్మ చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిని అందంగా తీర్చిదిద్దారు. యాత్రి సువిధా కేంద్రాలు, టూరిస్ట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్, వేదిక్‌ కేంద్ర, ముముక్షు భవన్, భోగ్‌శాల తదితర 23 భవనాలను ఆయన ప్రారంభించనున్నారు. గతంలో ఆలయ పరిసరాల్లో ఖాళీ జాగా 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం మాత్రమే ఉండగా దానిని ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు పెంచారు. ఇందుకోసం, ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 ఆస్తులను కొనుగోలు/ స్వాధీనంతోపాటు, మరో 1,400 మంది దుకాణదారులు, ఇళ్ల యజమానులకు వేరే చోట్ల  పునరావాసం కల్పించారు.  నగరంలో పర్యాటకరంగానికి  ఊపు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement