కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఆర్‌జీ కార్ ఆస్పత్రి హత్యోదంతంలో సందీష్ ఘోష్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సందీష్ ఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయా? అన్న కోణంలో కోల్‌కతా పోలీసులు దృష్టి సారించారు. అయితే ఆస్పత్రిలో సందీష్ ఘోష్ తన అధికారాన్ని ఉపయోగించి అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది జూన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం పరిశీలనలో ఉండగా.. తాజాగా కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
సందీష్ ఘోష్ 2021లో ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో అవినీతి జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిట్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రణబ్ కుమార్ నేతృత్వంలోని సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ తరుణంలో ఆగస్టు 9న ఆర్‌జీ కార్‌లో జరిగిన దారుణంతో సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. దుర్ఘటన జరిగిన రెండు రోజులకే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయడం.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోల్‌కతా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా సందీప్ ఘోష్‌ను 53 గంటల పాటు విచారించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే కోల్‌కతా పోలీసులు సందీప్ ఘోష్ అవినీతికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేయడం మరింత ఉత్కంఠగా మారింది.
సందీష్ ఘోష్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసినప్పటికీ అతని చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు ఘోష్‌ను మరే ఇతర వైద్య కళాశాలలో నియమించవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖను కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment