న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి పీఠంపై గిరిజన మహిళ సగర్వంగా కూర్చోవడం ఖాయమైనట్టే. ప్రాంతీయ పార్టీల నుంచి రోజురోజుకూ పోటెత్తుతున్న మద్దతు నేపథ్యంలో రాష్టపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్‌సీపీ, బీజేడీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(ఎస్), అకాలీదళ్, శివసేన, జేఎంఎం, టీడీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలుపగా తాజాగా యూపీలో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ సంకీర్ణ భాగస్వామి, ఓంప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) కూడా ఈ జాబితాలో చేరింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేస్తారని రాజభర్ ప్రకటించారు.
దీంతో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎంపీలు, రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు ఏకంగా 62 శాతం దాకా ఓట్లు ఖాయమయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువయ్యే సూచనలు కూడా కన్పిస్తున్నాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఆమె ఓటర్లు 50 శాతం కంటే తక్కువే తేలారు. ఆదివాసీ మహిళ కావడం, రాష్ట్రాలన్నీ చుడుతూ మద్దతు కోరుతుండటంతో ప్రాంతీయ పార్టీల నుంచి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మొత్తం 10,86,431 ఓట్లకు ఆమెకు ఇప్పటికే 6.68 లక్షల ఓట్లు ఖాయమైనట్టే. ఎస్పీతో తమ బంధం కొనసాగుతుందని రాజ్‌భర్ చెప్పినా, ముర్ముకు మద్దతు నిర్ణయంతో దానికి బీటలు పడ్డట్టేనని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment