
అమృత్‌సర్ : గత 230 సంవత్సరాలుగా అమెరికా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారి చిత్రాలను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన చిత్రకారుడు జగ్జోత్ సింగ్ రుబల్ రూపొందించారు. తాజాగా అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ చిత్రాన్ని అందులో జోడించారు. జార్జ్ వాషింగ్టన్ నుంచి బైడెన్ వరకు అందరి చిత్రాలను ఎంతో అందంగా తన పెయింటింగ్‌లో పొందుపరిచారు. ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్‌కు తాను శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నట్లు జగ్జోత్ సింగ్ వెల్లడించారు. బైడెన్ అధ్యక్షతన భారత్- అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండేలా ఈ పెయింటింగ్ వేశానని, ఇది మొత్తం పూర్తికావడానికి దాదాపు 4 నెలల సమయం పట్టిందని సింగ్ అన్నారు. (బంధాలు బలోపేతం)
తన పేరు మీద ఇప్పటికే పది ప్రపంచ రికార్డులు ఉండగా, తాజాగా తాను గీసిన పెయింటింగ్ అమెరికాలోని ఆర్ట్ గ్యాలరీలో లేదా వైట్ హౌస్‌లో ప్రదర్శించాల్సిందిగా కోరుకుంటున్నట్లు మనసులో మాటను బయటపెట్టారు. ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు శనివారంతో తెర పడిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 284 ఎలక్టోరల్ ఓట్లను సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించిన బైడెన్ త్వరలోనే వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!)