హరియాణాలోని కురుక్షేత్రలో రాహుల్ పూజలు
కురుక్షేత్ర: సమాజంలో పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిపోతున్న భయంతోపాటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలియజేశారు. పాదయాత్రను ఒక తపస్యగా భావిస్తున్నామని చెప్పారు. పాదయాత్ర అనేది నిరాడంబరతను సూచిస్తుందని, ఇదొక ధ్యానం లాంటిదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తపస్యను నమ్ముతోందని, అధికార బీజేపీ ఒక పూజల సంస్థ అని విమర్శించారు. తపస్యపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కే ప్రజలంతా పూజలు (ఆరాధన) చేయాలని అవి కోరుకుంటున్నాయని ఆక్షేపించారు. బలవంతంగానైనా జనంతో పూజలు చేయించుకోవాలని ప్రధాని మోదీ ఆశిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల తపస్య అంటే మోదీకి భయమని, అందుకే మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారని దుయ్యబట్టారు. హరియాణాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటం అనేది తపస్య కోసం జరిగిన యుద్ధమని అన్నారు. ఆ సమయంలో బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు బ్రిటిష్ పాలకులకు పూజలు చేశారని ఎద్దేవా చేశారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పూజల ప్రభావాన్ని ఎదిరించడానికి లక్షలాది మంది నేడు కాంగ్రెస్ పార్టీతో కలిసి తపస్యలో నిమగ్నమయ్యారని ఉద్ఘాటించారు. హిందూ దేవుళ్ల అభయ ముద్ర నుంచే కాంగ్రెస్ పార్టీ గుర్తు (హస్తం) పుట్టిందని రాహుల్ అన్నారు. తాను ఒక తపస్వినని చెప్పారు. ఇకపైనా తపస్విగానే కొనసాగుతానని వివరించారు. తన యాత్ర రాజకీయ పోరాటం కాదని స్పష్టంచేశారు. బీఎస్సీ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)కు వ్యతిరేకంగా పోరాడితే అది రాజకీయ పోరాటం అవుతుందన్నారు. తమది ధర్మం కోసం సాగుతున్న సిద్ధాంతపరమైన పోరాటమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశంలో రైతన్నలు కష్టాల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment